ఇస్రో విజయాన్ని పేర్కొంటూ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మన సంకల్పాన్ని చంద్రుడిపై సాకారం చేసుకున్నామని అన్నారు. ఈ క్షణాలు అద్భుతమైనవని, అపూర్వమైనవని చెప్పారు. ఈ విజయం 140 కోట్ల భారత ప్రజల గుండె చప్పుడును వెల్లడిస్తుందని వివరించారు.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్‌గా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఇస్రో కార్యాలయంలోని ఉద్యోగులంతా హర్షాతిరేకాల్లో మునిగిపోయారు. చంద్రయాన్ 3 చివరి ఘట్టాన్ని వీక్షించడానికి ఇస్రో శాస్త్రవేత్తలతో ఆన్‌లైన్‌లో ప్రధాని మోడీ కూడా కలిశారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సందర్భంగా ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను, జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ క్షణాలు ఉద్విగ్నమైనవని, అపూర్వమైనవని, అద్భుతమైన క్షణాలని ప్రధాని మోడీ అన్నారు. ఈ విజయం 140 కోట్ల భారత ప్రజల హృదయ స్పందనలు అని వివరించారు. ఈ విజయం కొత్త శక్తి, కొత్త విశ్వాసాన్ని, కొత్త చైతన్యానికి ప్రతీక అని చెప్పారు. అమృతకాలపు తొలి ఫలితాల పరంపర మొదలైందని తెలిపారు. మన సంకల్పాన్ని చంద్రుడిపై సాకారం చేసుకున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉన్నదని వివరించారు. అంతరిక్షంలో కొత్త భారత దేశ కొత్త ప్రతీకను నిలిపారని పేర్కొన్నారు.
తామను బ్రిక్స్ సమ్మిట్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నానని, కానీ, దేశంలోని ప్రతి పౌరుడి తరహాల తన మనస్సులోనూ మొత్తం చంద్రయాన్ 3 గురించిన ఆసక్తే ఉన్నదని వివరించారు. దేశం కొత్త చరిత్ర లిఖించడంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. దేశమంతా ఉత్సవం ప్రారంభమైందని చెప్పారు. ఇది వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అనే తమ నినాదానికి నిదర్శనం అని వివరించారు.
Also Read: చంద్రయాన్-3 : నరాలు తెగే ఉత్కంఠ.. లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించిన 9 మిలియన్ల మంది
ఈ విజయం కేవలం భారత్‌కు పరిమితం కాదని, ప్రపంచ మానవాళి విజయంగా దీన్ని చూడాలని ప్రధాని మోడీ చెప్పారు. ఇది హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ విజయం మొత్తం మానవాళికి చెందిన దని వివరించారు. ఈ విజయంతో ఇతర దేశాల కూ లబ్ది చేకూరుతుందని, ఇతర దేశాలకూ తాము సహకరిస్తామని చెప్పారు.
