Asianet News TeluguAsianet News Telugu

తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన పీయూష్ గోయల్.. బీహార్ ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టీకరణ

బీహార్ ను, ఆ రాష్ట్ర ప్రజలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు.

Piyush Goyal, who backtracked on his comments, clarified that he had no intention of insulting the people of Bihar
Author
First Published Dec 22, 2022, 3:09 PM IST

ఆర్జేడీ నేత మనోజ్ ఝాకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీహార్ పై చేసిన వ్యాఖ్యల పట్ల వెనక్కి తగ్గారు. తనకు బీహార్ ప్రజలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.

రాహుల్ గాంధీ యాత్రను ఆపడానికి కోవిడ్ అంశం తీసుకువ‌చ్చిన కేంద్రం.. : శివ‌సేన

గురువారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సభా నాయకుడిగా ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ‘‘బీహార్ ను గానీ, బీహార్ ప్రజలను గానీ అవమానించే ఉద్దేశం నాకు లేదని స్పష్టం చేస్తున్నాను. ఒకవేళ నా మాటలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే వెంటనే వాటిని ఉపసంహరించుకుంటాను. ఎవరినీ కించపర్చడానికి నేను ఆ మాటలు అనలేదు. ’’ అని ఆయన అన్నారు.

చైనాను వణికిస్తున్న కరోనా వేరియంట్ బీఎఫ్.7 స్వభావం?.. సోకితే వచ్చే లక్షణాలు ఏమిటీ?

అదనపు ఖర్చులకు పార్లమెంటు ఆమోదం కోరుతూ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా గోయల్ మంగళవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ.. పేదలు, కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వం సమాన శ్రద్ధ చూపాలని అన్నారు. దీనికి కౌంటర్ గా గోయల్ స్పందిస్తూ ‘‘ఇంకా బాస్ చలే తో దేశ్ కో బీహార్ బనా దే (వారి ఇష్టానుసారం జరిగితే దేశం మొత్తం బీహార్ అవుతుంది)’’ అని అన్నారు.

అయితే దీనిపై మనోజ్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌కు బుధవారం  లేఖ రాశారు. బీహార్‌ను కించపరిచినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం కూడా సభలో ఆయన మాట్లాడుతూ.. బీహార్ ను అవమానించడం మొత్తం దేశానికి అవమానమని అన్నారు. గోయల్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోయల్ వ్యాఖ్యలు గొప్ప రాష్ట్రాల్లో ఒక దానిని కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

తప్పతాగిన వ్యక్తి పబ్లిక్ ప్లేస్‌లో మూత్రించకుండా అడ్డుకున్న పోలీసు.. కత్తితో దాడికి దిగిన మందుబాబు

“బీహార్‌ను కేంద్రంలోని ప్రభుత్వాలు చాలా కాలంగా విస్మరించాయి. బీహారీలను ఎప్పుడూ రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక పక్షపాతాలను అధిగమించడానికి జాతీయ ఆందోళన, సానుభూతి అవసరం ’’ అని అంతకు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios