కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ పథకాన్ని సమర్థిస్తుంటే, మరి కొందరు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఆప్ నేత రాఘవ్ చద్దా అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేఖ రాశారు.
సైనికులకు మనశ్శాంతి, ఉద్యోగ భద్రత ముఖ్యమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ద్వారా వారికి అవి లభించే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా ఆయన ఐదు అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖను ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా షేర్ చేశారు.
ఆర్మీ ప్రాథమిక నిర్మాణంలో ఇటీవల జరిగిన మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురి చేశాయని ఆప్ నేత తన లేఖలో పేర్కొన్నారు. సాయుధ దళాల వివాదాస్పద కాంట్రాక్టులైజేషన్ ద్వారా అనేకమంది యువ ఔత్సాహికుల ఆశలు, కలలు అణిచివేతకు గురయ్యాయని తెలిపారు. ‘‘ గత రెండు రోజుల్లో జరిగిన ఆందోళనల వల్ల చివరి నిమిషంలో వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మేము చాలా నిరాశకు గురయ్యాము ’’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
‘‘ మన సైనికులకు మనశ్శాంతి, ఉద్యోగ భద్రత చాలా ముఖ్యం. నాలుగు సంవత్సరాల తరువాత ఏం చేయాలి అని ఆలోచించే ఒక జవాను దేశానికి సరిగా సేవ చేయలేడు. తక్కువ కాలం శిక్షణ ఇవ్వడం వల్ల సేవల నాణ్యతపై ప్రతికూల పరిణామం ఉంటుంది. మన సరిహద్దులను రక్షించే వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత నుంచి మనం తప్పించుకోకూడదు. బడ్జెట్ ను బ్యాలెన్స్ చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టలేం’’ అని ఆయన అన్నారు.
agnipath: విధ్వంసం వద్దు... శాంతియుతంగా నిరసన తెలపండి: ఆసుపత్రి నుంచే యువతకు సోనియా పిలుపు
ఈ పథకం రెజిమెంటల్ గౌరవాన్ని తిరస్కరిస్తుందని, అలాగే దళాల నాణ్యతను తగ్గిస్తుందని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. వారి తోటివారితో గడిపిన తక్కువ వ్యవధితో మనం దళాల స్ఫూర్తిని త్యాగం చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ప్రయోగాలను సామూహిక౦గా రుద్దకూడదని తెలిపారు. ఈ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుత సంవత్సరానికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్ ప్రక్రియను పునఃప్రారంభించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించడానికి, సంప్రదించడానికి ఈ ఆకస్మిక నిర్ణయంతో ప్రభావితం అవుతున్నఔత్సాహికు యువకులు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ అగ్నిపథ్ పథకంపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
