అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్నాయి. ఇదే సందర్భంలో ఎయిర్ ఫోర్స్‌లో ఈ స్కీం కింద నియామకాలు చేపడుతామని ప్రకటన వెలువడ్డది. అయితే, ఆందోళనల్లో పాల్గొన్నవారికి పోలీసు క్లియరెన్స్ రాదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ఇందులో ప్రముఖంగా యువతనే పాల్గొంది. ఈ స్కీంతో తమ భవిష్యత్ గందరగోళంలో పడుతుందని వారు ఆందోళనలకు దిగారు. అవి హింసాత్మకంగానూ మారాయి. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునేదే లేదని అదే స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ వీ ఆర్ చౌదరి ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చారు.
అగ్నిపథ్ స్కీం గురించి రెండేళ్లుగా చర్చలు జరిపామని, ఈ స్కీంకు ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ వీ ఆర్ చౌదరి అన్నారు. ఈ హింసను తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలు దేనికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్కీం రిక్రూట్‌మెంట్‌లో చివరి స్టెప్ పోలీసు వెరిఫికేషన్ అని వివరించారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో ప్రమేయం ఉన్నవారికి పోలీసుల నుంచి క్లియరెన్స్ రాదని హెచ్చరించారు.
కాగా, అగ్నిపథ్ స్కీంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ ప్రోగ్రామ్ గురించి అనుమానాలు ఉన్నవారు సమీపంలోని మిలిటరీ స్టేషన్, ఎయిర్ ఫోర్స్, నావల్ బేస్‌ల వద్దకు వెళ్లి వాటిని నివృత్తి చేసుకోవాని చెప్పారు.
ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నవారు తక్షణమే సరైన సమాచారాన్ని పొందాలని అన్నారు. స్కీం గురించి సమగ్ర వివరాలు తెలుసుకుని అప్పుడు అంచనాకు రావాలని వివరించారు. అలాగైతేనే.. ఆ స్కీం ద్వారా వారు పొందనున్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటారని తెలిపారు. ఈ స్కీం గురించి పూర్తిగా చదివితే.. వారిలో సందేహాలు పటాపంచలు అవుతాయని నమ్మకం ఉన్నదని అన్నారు.
ఈ స్కీంను రద్దు చేసే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్లలో వారి భవిష్యత్‌కు సంబంధించిన ఆందోళనలకు కేంద్రప్రభుత్వం, రక్షణ శాఖ సరైన పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నాలు చేస్తుందని వివరించారు.
