కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ స్కీంకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. నాలుగేళ్ల డ్యూటీ పూర్తి చేసిన అగ్నివీర్లను రక్షణశాఖలో మళ్లీ తీసుకోవడానికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను సందేహాలను నివృత్తి చేస్తూ.. వారి ఆగ్రహావేశాలను చల్లార్చడానికి కేంద్ర ప్రభుత్వం స్కీంలో పలు మార్పులు ప్రకటించింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచడంతోపాటు పలు సడలింపులు నిర్ణయించింది. తాజాగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో ఆఫర్ ప్రకటించారు. నాలుగేళ్ల సైన్యంలో సేవలు అందించిన అగ్నివీర్లను రక్షణ శాఖలోనే నియమించుకోవడానికి పది శాతం కోటా కల్పిస్తామని వెల్లడించారు.

నాలుగేళ్లు అగ్నివీర్లు చేసిన తర్వాత రిటైరైతే.. తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకారులు లేవనెత్తుతున్న ప్రధాన విషయాల్లో ఒకటి. దీనికి సమాధానంగా తాజాగా, కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన వెలువరించారు. నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు.. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, అన్ని 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో చేర్చుకోవడానికి పది శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఇది వరకే ఉన్న రిజర్వేషన్‌కు తోడు ఇది అదనంగా ఉంటుందని వివరించారు.

ఇందుకు సంబంధించిన సవరణలు రిక్రూట్‌మెంట్ రూల్స్‌లో తీసుకువస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే.. పది శాతం రిజర్వేషన్ల కింద ఉద్యోగంలోకి తీసుకునే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లకూ ఇదే తరహా మార్పులు చేయాలని సూచిస్తామని వివరించారు. అంతేకాదు, అవసరమైన మేరకు వయో పరిమితిలో మార్పులనూ చేపడతామని తెలిపారు.

Scroll to load tweet…

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయమే అగ్నిపథ్ స్కీంలో పలు సడలింపులు ప్రకటించింది. ఆందోళనకారుల ఆగ్రహావేశాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస ఫోర్సెస్, అసోం రైఫిల్స్‌లలో పది శాతం రిజర్వేషన్ ఆగ్నివీర్లకు కల్పిస్తామని ఈ రోజు ఉదయమే ప్రకటన ఇచ్చింది. అయితే, సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లు రక్షణ శాఖ పరిధిలోకే వస్తాయి.

సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లలో చేరే అగ్నివీర్ల వయోపరిమితిన మరో మూడేళ్లు సడలిస్తామనీ హోం శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది.