న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు ఉరిపై స్టే ఇవ్వడానికి పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. డెత్ వారంట్ పై స్టే ఇవ్వాలని నిర్భయ కేసు దోషులు పెట్టుకున్న పిటిషన్ ను పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా తోసిపుచ్చారు. 

నిర్భయపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు రేపు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి ఖాయంగా కనిపిస్తోంది. అన్ని న్యాయపరమైన అవకాశాలను దోషులు వాడుకున్న నేపథ్యంలో ఉరి తప్పే విధంగా కనిపించడం లేదు. 

Also read: నిర్భయ కేసు: ముకేష్ సింగ్ పిటిషన్ కొట్టివేత, అక్షయ్ పిటిషన్ పై విచారణ

నేరం జరిగినప్పుడు తాను మైనర్ ను అంటూ పవన్ గుప్తా దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం ఉదయం కొట్టేసింది. నేరం జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ మరో దోషి అక్షయ్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కొట్టేసింది. 

రేపు ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి పడుతుందనే విశ్వాసం తనకు ఉందని నిర్బయ తరఫు న్యాయవాది సీమా కుశ్వాహా అన్నారు.

Also Read: నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ కేసులోని ఆరుగురిలో ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.