నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ నుసుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది.ఈ కేసులో తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also read:నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఉరిపై స్టే కోరుతూ కోర్టుకెక్కిన దోషులు

న్యాయపరంగా ఉన్న అన్ని రకాల అవకాశాలను నిర్భయ కేసులో దోషులు వినియోగించుకొంటున్నారు. మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

2012లో నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో తాను మైనర్ ని అంటూ దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ నేరం జరిగిన సమయంలో తాను మైనర్ కాబట్టి తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

ఇదే విషయమై పవన్ గుప్తా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే ఈ పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది.పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ పై ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు నిర్ణయం తీసుకొంది.

2012 డిసెంబర్ 12వ తేదీన 23 ఏళ్ల మెడికో నిర్భయపై అత్యంత దారుణంగా అత్యారానికి పాల్పడ్డారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె 2012 డిసెంబర్ 29వ తేదీన మృతి చెందింది.

2017 డిసెంబర్ మాసంలో సహ దోషి వినయ్ శర్మతో కలిసి సుప్రీంకోర్టులో తొలుత రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్ ను 2018 జూలై మాసంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిర్భయ కేసులో దోషులుగా ఉన్న అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మలు న్యాయపరంగా ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనే ప్రయత్నాలు చేశారు.

రాష్ట్రపతి కోవింద్ ను క్షమాభిక్ష కోరుతూ కూడ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.మెర్సీ పిటిషన్లపై కూడ రివ్యూ పిటిషన్లను కూడ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లను కూడ సుప్రీంకోర్టు తిరస్కరించింది.