Parliament Security Breach: ముందుగానే రెక్కీ చేశారు.. 18 నెలల ప్లాన్ ఇదీ!.. నిందితుల గురించి కీలక వివరాలు

పార్లమెంటులో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్ సభ బెంచ్‌ల వైపు దూసుకెళ్లి అలజడి రేపిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటన కోసం ఇద్దరు నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించారు. 18 నెలల క్రితం ఈ ఆరుగురు మైసూరులో సమావేశమయ్యారు. రైతుల ఆందోళన, మల్లయోధుల ధర్నాలోనూ వీరు పాల్గొన్నారు. 
 

Parliament security breach accused done recce, meet 18 months ago in mysuru, details about accused kms

న్యూఢిల్లీ: లోక్ సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి ఇద్దరు నిందితులు భద్రతను ఉల్లంఘించి చట్ట సభ్యుల బెంచీల వైపుగా దూసుకెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న క్యానిస్టర్లు తెరిచి పసుపు వర్ణంలోని పొగను చిమ్మారు. ఈ ఘటనతో పార్లమెంటులో, దేశమంతటిలో అలజడి రేగింది. ఈ ఘటనకు సంబంధించి కీలక వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

ఈ ఘటనకు కొన్ని నెలల ముందే ప్రణాళికను రచించినట్టు తెలిసింది. నిందితుడు డీ మనోరంజన్ ముందుగానే రెక్కీ కూడా నిర్వహించారు. పార్లమెంటు భవనంలోని సెక్యూరిటీ గురించి, భద్రతా చర్యల గురించి వివరాలు కనుక్కున్నాడు. గతంలోనే వ్యాలిడ్ పాస్‌లు తీసుకుని పార్లమెంటులో విజిటర్స్ గ్యాలరీలోకి మనోరంజన్ వెళ్లాడు. అప్పుడు ఒక విషయాన్ని ఆయన పరిశీలించాడు. విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లుతున్నవారి షూస్‌ను చెక్ చేయడం లేదని గుర్తించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పాయింట్ ఆధారంగా నిందితులు  ఘటనకు ప్లాన్ చేశారు.

మనోరంజన్ తన షూస్‌లోపల కానిస్టర్లు దాచుకునేలా ప్లాన్ చేశాడు. ఈ విధంగానే వారు అన్ని భద్రతా స్థాయిలను దాటుకుని విజిటర్స్ గ్యాలరీలోకి క్యానిస్టర్లను తీసుకెళ్లగలిగారు. విజిటర్స్ గ్యాలరీలో ఉన్నప్పుడు మనోరంజన్ తన షూస్ విప్పి క్యానిస్టర్లు తీయడాన్ని చూశానని  ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

Also Read: Parliament Attack: గెలుపో.. ఓటమో.. కానీ,: పార్లమెంటులో దాడికి ముందు ఇన్‌స్టాలో నిందితుడు సాగర్ శర్మ పోస్టు

సాగర్ శర్మ కూడా రెక్కీ నిర్వహించాడు. జులైలో ఆయన పార్లమెంటు కాంప్లెక్స్‌లో రెక్కీ నిర్వహించాడు. అయితే, బయటి నుంచే పరిశీలనలు జరిపి వారి గ్రూపుతో వివరాలు పంచుకున్నట్టు తెలిసింది. 

18 నెలల నుంచీ..

ఈ ఆరుగురూ సోషల్ మీడియా వేదికగా పరిచయం అయ్యారు. వీరు తొలుత 18 నెలల క్రితం మైసూరులో కలుసుకున్నారు. వీరి తొలి భేటీ 18 నెలల క్రితమే జరిగినట్టు పోలీసులు తెలిపారు. తొలి సమావేశం తర్వాత వారు ముఖ్యం అని భావించిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్‌లో హింస వంటి అంశాలపై పార్లమెంటులో చర్చకు రావాలంటే ఏం చేయాలా? అనే ఆలోచనలు చేశారు. వ్యూహాలపై చర్చలు జరిపారు. అయితే.. 9 నెలల క్రితం ఈ వ్యూహాలపై వారికి ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తున్నది. ఢిల్లీ సరిహద్దులో రైతులు ధర్నా చేస్తున్న సమయంలోనే వారు ఛండీగడ్ ఎయిర్‌పోర్టు సమీపంలో నిరసనలు చేశారు. ఈ ఎయిర్‌పోర్టుకు భగత్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు.

నిందితుల గురించీ..

ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఆరుగురు నిందితులు సోషల్ మీడియాలోని జస్టిస్ ఫర్ ఆజాద్ భగత్ సింగ్ అనే గ్రూపులో కలుసుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వివరించాయి. ఇందులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మైసూరుకు చెందిన డీ మనోరంజన్ (ఇంజినీరింగ్ డిగ్రీ), సాగర్ శర్మ(లక్నోకు చెందిన గ్రాడ్యుయేట్), నీలమ్ ఆజాద్ (హిసార్‌కు చెందిన సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్), అన్మోల్ షిండే (లాతూర్‌కు చెందిన డిగ్రీ పట్టభద్రుడు), విక్కీ అలియాస్ విశాల్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు లలిత్ ఝా పరారీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వీరిపై ఉపా కేసు ఫైల్ చేసినట్టు వివరించాయి.

Also Read: Isreal Soldier: హమాస్ దాడిలో 12 బుల్లెట్లు దిగబడి.. చావును ఎదురుచూస్తూ.. మృత్యువును జయించిన యువతి విజయగాధ

మనోరంజన్, సాగర్ శర్మలు పబ్లిక్ గ్యాలరీ నుంచి చాంబర్‌లోకి దూకి క్యానిస్టర్లు ఓపెన్ చేశారు. ఆజాద్, షిండేలు పార్లమెంటు వెలుపల గ్యాస్ క్యానిస్టర్లు ఓపెన్ చేసి తానాషాహీ నహీ చలేగీ(నియంతృత్వం ఇక చెల్లదు) అనే నినాదాలు ఇచ్చారు. కాగా, వీరిద్దరినీ లలిత్ ఝా వీడియో తీస్తూ ఉన్నాడు. పోలీసులు నినాదాలు చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటూ ఉండగా లలిత్ ఝా పారిపోయాడు.

నిరుద్యోగం, ఇతర సమస్యలపైకి చట్టసభ్యుల దృష్టి మరల్చానే ఉద్దేశంతోనే ఒక నిరసనగా ఈ పని చేశామని నలుగురు నిందితులు పోలీసులు దర్యాప్తులో వెల్లడించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నలుగురికి ఎలాంటి నేర చరిత లేదు.

Also Read: Googled Peoples: వీరి గురించి భారతీయులు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారుగా..!

గతంలోనూ నిరసనలు:

నిందితులు గతంలోనూ పలు నిరసనల్లో పాల్గొన్నట్టు సమాచారం. మూడు సాగు చట్టాల ఉపసంహరణ కోసం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, యూపీ రైతులు ఆందోళనలు జరిపినప్పుడు వారికి మద్దతుగా నిందితులూ అక్కడికి వెళ్లినట్టు తెలిసింది. అలాగే.. జంతర్ మంతర్ వద్ద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మల్లయోధులు చేసిన నిరసనల్లోనూ వీరు పాల్గొన్నట్టు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios