పార్లమెంట్ లో తోపులాట ...మరో బిజెపి ఎంపీకి తీవ్ర గాయాలు, ఐసియులో పెట్టిన వైద్యులు
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇందులో పలువురు బిజెపి ఎంపీలు గాయపడ్డారు... వీరిలో ఒకరు ఐసియులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
గురువారం పార్లమెంట్ రణరంగంగా మారింది. కేవలం మాటల యుద్దానికే పరిమితమయ్యే అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ పరస్పరం ఒకరిపైకి ఒకరు వెళ్ళారు. క్రమంలో జరిగిన తోపులాటలో బిజెపి ఎంపీలు గాయపడ్డారు.తోపులాటలో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రతాప్ చంద్ర సారంగి హాస్పిటల్లో చేరారు. అయితే మరో ఎంపీ ముఖేష్ రాజ్ పుత్ కూడా ఈ తోపులాటలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా వుండటంతో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
అసలు పార్లమెంట్ వద్ద ఏం జరిగింది :
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇటీవల భారత రాజ్యాంగంపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అంబేద్కర్...అంబేద్కర్... అంబేద్కర్ అనడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయ్యింది... ఇలా దేవుడి పేరు స్మరించుకుంటే స్వర్గానికి చేరుకునేవారని హోంమంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగి ఇప్పుడు పార్లమెంట్ లో గొడవలకు కారణం అవుతున్నాయి.
రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని... ఆయనను కేంద్ర కేబినెట్ నుండి తొలంగించాలని కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి కీలక నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో బిజెపి ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీయే బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిందంటూ నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదే పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ఇలా బిజెపి, కాంగ్రెస్ ఎంపీల నిరసనతో పార్లమెంట్ రణరంగంగా మారింది.
నిరసనకు దిగిన బిజెపి, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇందులోనే పలువురు బిజెపి ఎంపీలు గాయపడ్డారు... వీరిలో ముఖేష్ రాజ్ పుత్ కు తీవ్ర గాయాలు కావడంతో ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరో ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి కూడా ఈ తోపులాటలో తల పగిలి తీవ్ర గాయమైంది. ఆయన కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వల్లే తాను గాయపడినట్లు ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి చెబుతున్నారు.