న్యూఢిల్లీ: తనపై జరుగుతున్న అన్ని విచారణలను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  30 ఏళ్లకు పైగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ పోలీస్ అధికారి  తన స్వంత రాష్ట్రంలోని పోలీసులను నమ్మకపోవడం దిగ్బ్రాంతికరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

also read:ఆ కేసును తప్పుదోవ పట్టించేందుకే, హోంమంత్రిపై ఆరోపణలు: శరద్ పవార్

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పోలీస్ అధికారి సచిన్ వాజేకు ప్రతి నెల రూ. 100 కోట్లు వసూలు చేయాలనే టార్గెట్ పెట్టారని పరమ్ బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఆయనను ముంబై కమిషనర్ పదవి నుండి  తొలగించింది ఉద్దవ్ సర్కార్.హోంగార్డ్స్ డీజీగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. 

తనపై నమోదైన కేసులను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.స్వంత రాష్ట్రంలోని పోలీస్ శాఖపై నమ్మకం లేకపోతే ఎలా అని సుప్రీం ప్రశ్నించింది. మీరు పనిచేస్తున్న పోలీస్ శాఖను మీరే అవమానించడం సరైందికాదని సుప్రీం అభిప్రాయపడింది. విచారణను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయడం జరగదని  ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.