పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనకాల పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా విశ్వసిస్తున్న భారత్.. పాక్ పై ప్రతికార చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ఆ దేశంపై పలు నిషేధాలు విధిస్తు నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ను వెలివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడుల వెనకాల పాకిస్థాన్ ప్రోత్సాహం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాక్ పై పలు నిషేధాలు విధిస్తోంది కేంద్రం. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు.
దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై కఠినంగా వ్యవహరిస్తోంది. సింధు జల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయడం, అట్టారీ సరిహద్దును మూసివేస్తూ బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ఈరోజు ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసేసింది.
పహల్గాం దాడి తర్వాత భారత్ 5 కీలక నిర్ణయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణ దాడి తర్వాత, సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నందుకు భారత్ బుధవారం పలు దౌత్య చర్యలు తీసుకుంది.
సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నట్లు భారత్ ఆరోపించింది. 1960 సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను వెంటనే మూసివేసింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) కింద పాకిస్తాన్ ప్రయాణాలను నిలిపివేసింది.
అంతకు ముందు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. SVES కింద ఉన్న పాకిస్తాన్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశం తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈ దాడిని CCS ఖండించింది. దోషులను న్యాయం ముందుకి తీసుకురావాలని నిర్ణయించింది.
దాడికి పాల్పడిన వారిని వెంబడించడంలో భారత్ దృఢంగా ఉంటుందని మిశ్రి తేల్చి చెప్పారు. “తాహవ్వూర్ రాణా ఇటీవలి అప్పగింతలాగే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారత్ దృఢంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
