ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో అలజడి సృష్టించేలా పాక్ ప్రచారం చేస్తోందని భారత విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తం చేసాయి. పాకిస్ధాన్ ప్రచారానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
India Pakistan War : ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ టార్గెట్ గా పాక్ క్షిపణి దాడులకు దిగింది. దీంతో భారత్ ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడమే కాదు ప్రతిదాడులకు దిగింది. ఈ యుద్దవాతావరణం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో మరోసారి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తాజా పరిణామాల గురించి వివరించారు.
ముఖ్యంగా పాకిస్థాన్ చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తిప్పికొట్టారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు పాక్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు... కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
పాకిస్తాన్ ఇప్పటికీ జనావాస ప్రాంతాలపై దాడులు చేస్తోందన్న ప్రచారం అవాస్తవం. S-400 క్షిపణి స్థావరం, బ్రహ్మోస్ కేంద్రం ధ్వంసం చేశామని పాకిస్తాన్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని అన్నారు.
ఇక భారత ఇంధన మార్గాలను, విద్యుత్ గ్రిడ్‌ను ధ్వంసం చేసినట్లు ప్రచారం కూడా అవాస్తవమని అన్నారు. ఇప్పటివరకు పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
శ్రీ అమృత్‌సర్ సాహిబ్‌పై దాడి చేసింది భారతదేశమేనన్న పాక్ ప్రకటన మిస్రి తప్పుబట్టారు. అలాగే భారత క్షిపణులు ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేశాయన్నది కూడా అబద్ధమని అన్నారు. ఆఫ్ఘాన్‌లో గత కొంతకాలంగా ఎవరు దాడి చేస్తున్నారో అందరికీ తెలుసని విక్రమ్ మిస్రి అన్నారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు మత కేంద్రాలపై పాకిస్తాన్ దాడి చేస్తోందని కూడా స్పష్టం చేశారు.
పాక్ కు చెందిన మానవరహిత చిన్న విమానాలు, సాయుధ డ్రోన్లు, లాయిటరింగ్ యంత్రాలు, యుద్ధ విమానాలు జనావాస ప్రాంతాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయన్నారు. చాలాసార్లు వాయు సరిహద్దును ఉల్లంఘించి దాడులు చేశారని ఆరోపించారు. శ్రీనగర్ నుండి నాలియా వరకు 26 ప్రాంతాల్లో దాడులు జరిగాయని... ఉధంపూర్, పఠాన్‌కోట్, ఆదంపూర్, భుజ్‌లను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. పంజాబ్‌లోని అనేక విమానాశ్రయాలపై తెల్లవారుజామున 1.40 గంటల తర్వాత క్షిపణి దాడులు జరిగాయని... ఈ దాడులను తిప్పికొట్టినట్లు తెలిపారు. పాక్ ముందు దాడిచేయడంతోనే ప్రతిస్పందనగా భారత్ దాడి చేసిందని కూడా విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు.


