Asianet News TeluguAsianet News Telugu

భారత్‌తో సరిహద్దును పర్యవేక్షించే చైనా కమాండ్‌లోకి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు.. నిఘా వర్గాల వెల్లడి

భారత్‌తో వైరం పెట్టుకున్న పాకిస్తాన్, చైనా దేశాలు మరింత సన్నిహిత్యం పెంచుకుని ఆర్మీ, నిఘా సహకారాల్లోనూ కీలక అడుగులు వేశాయి. తాజాగా, భారత్‌తో చైనా సరిహద్దును పర్యవేక్షించే డ్రాగన్ కంట్రీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులను నియమించడం చర్చనీయాంశమైంది.
 

pakistan army officers in china western theatre command
Author
New Delhi, First Published Oct 1, 2021, 6:30 PM IST

న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉందో చెప్పడం కష్టం. ఈ రెండు దేశాలతోనూ సరిహద్దులో యుద్ధం జరిగిన చరిత్ర ఉన్నది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఆపడం లేదు. కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపే పనిని మానుకోలేదు. మరోవైపు చైనాతో జరిగిన ఘర్షణల తాలూకు ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పటికీ గాల్వన్ లోయలో టెన్షన్ టెన్షన్‌గానే రోజులు గడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనదేశంతో వైరం పెట్టుకున్న ఈ రెండు దేశాలు ఆర్మీలో సఖ్యత మరో ముప్పుకు ఊతం ఇస్తున్నదా? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి.

భారత్‌, భూటాన్‌లతో పంచుకుంటున్న సరిహద్దును పర్యవేక్షించే వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులను పోస్టు చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్, సదరన్ థియేటర్ కమాండ్‌లలో పాక్ ఆర్మీకి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ అరేంజ్‌మెంట్ కింద ఈ పోస్టింగ్‌లు జరిగినట్టు నిఘావర్గాలు తెలిపాయి.

భారత్, చైనాల మధ్య ఉపసంహరణ ప్రక్రియపై ఒప్పందం కుదిరినప్పటికీ డ్రాగన్ కంట్రీ ఇంకా పెద్దమొత్తంలో ఆర్మీని సరిహద్దులో మోహరించే ఉంచింది. వాస్తవాధీన రేఖ వెంబడి లడాక్ రీజియన్‌లో చైనా వైపుగా ఇంకా డ్రాగన్ ఆర్మీ ఉన్నది.

సదరన్ థియేటర్ కమాండ్ హాంకాంగ్, మకావ్, ఇతర ఏరియాలను పర్యవేక్షిస్తుంటుంది.

అంతేకాదు, కల్నల్ ర్యాంక్ పాక్ ఆర్మీ అధికారులను చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లోని జాయింట్ స్టాఫ్ డిపార్ట్‌మెంట్‌లోనూ పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ డిపార్ట్‌మెంట్ యుద్ధ తంత్రాలు రచించడం, ట్రెయినింగ్, చైనా ఆర్మీ వ్యూహాలను రచిస్తుంటుంది. మరో పది మంది పాక్ ఆర్మీ అధికారులను బీజింగ్‌లోని పాకిస్తాన్ ఎంబసీలో నియమించినట్టు సమాచారం. చైనా ఆర్మీ నిర్మాణాల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios