సారాంశం
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ సైన్యంలో రాజీనామాల ఊహాగానాలు వ్యాపించాయి. ఐఎస్‌పిఆర్ ద్వారా క్రమశిక్షణ, ఐక్యతను పాటించాలని, రాజీనామా చేస్తే చర్యలు తప్పవని సైన్యానికి హెచ్చరిక జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదు.
పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులతో సహా 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తో యుద్దానికి భయపడి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో పాక్ ప్రభుత్వం సైన్యానికి కఠినమైన హెచ్చరిక జారీ చేసింది.
భయపడి పారిపోవద్దని...క్రమశిక్షణ, ఐక్యతను కలిగి ఉండాలని కోరింది. ఈమేరకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) నుండి ఓ ప్రకటన వెలువడినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది అధికారక లేఖనా లేక ఫేక్ దా అన్నది తెలియాల్సి ఉంది.
ఐఎస్‌పిఆర్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఫైసల్ మెహమూద్ మాలిక్ సంతకం చేసినట్లు చెప్పబడుతున్న ఈ పత్రం సోమవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. అన్ని ర్యాంకుల పాకిస్తాన్ సాయుధ దళాలు దేశాన్ని రక్షించుకోవడానికి నిబద్ధతతో ఉండాలని ఇందులో సూచించారు.
పాకిస్తాన్ సైనిక సిబ్బంది భయాన్ని వీడి దృఢంగా నిలబడాలని ఐఎస్‌పిఆర్ మెమో పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌ను రక్షించుకోవడానికి వారు చేసిన పవిత్ర ప్రమాణాన్ని గుర్తు చేసింది. అనధికార రాజీనామాలు లేదా పారిపోవడం 1952 పాకిస్తాన్ ఆర్మీ చట్టం ప్రకారం కఠినమైన జరిమానాలను ఎదుర్కొంటాయని కూడా నొక్కి చెప్పింది.
గమనిక: వైరల్ డాక్యుమెంట్ యొక్క వాస్తవికతను ఆసియా నెట్ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు.