PAK vs AFG, CWC 2023 : చెన్నై స్టేడియంలో త్రివర్ణ పతాకంపై నిషేధం, భారత జెండాలను డస్ట్‌బిన్‌లో వేసిన పోలీసులు..
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులను స్టేడియంలోకి భారత జెండాలు తీసుకెళ్లకుండా ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ నిషేధించారు. వాటిని తీసి డస్ట్ బిన్ లో వేశాడు.
చెన్నై : ఐసిసి ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో సోమవారం చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కు వచ్చిన అభిమానులు కొందరు స్టేడియంలోకి భారత జెండాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని ఓ పోలీసు అధికారి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది.
స్టేడియంలోకి త్రివర్ణ పతాకంతో ఎంటరైన కొంతమంది అభిమానుల నుంచి జెండాను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారి.. ఆ జెండానలు డస్ట్‌బిన్‌లో పడవేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది చూసిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆ పోలీసు అధికారి భారత జెండాలను తిరిగి డస్ట్ బిన్ లోంచి తీసి.. స్టేడియంలో ఉన్న పోలీసు వాహనంలో పెట్టాడు.
India-Pak మ్యాచ్ లో 'జై శ్రీరామ్' నినాదాలు.. డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ పై బీజేపీ ఫైర్
పోలీసు అధికారి వాహనంలో జెండాలను ఉంచుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. కొన్ని టెలివిజన్ న్యూస్ ఛానెల్‌లు ఈ విజువల్స్ ను ప్రసారం చేశాయి.ఆ పోలీసు అధికారి ఎందుకు ఇలా ప్రవర్తించాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అభిమానులను తనిఖీలు చేయడం.. చిన్న జెండా కర్రలను తీసుకెళ్లకుండా నిరోధించడం సర్వసాధారణం. అదే సమయంలో క్లాత్ జెండాలను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే, బీజేపీ, దాని మద్దతుదారులు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో #DMK_HatesIndianFlag అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. డీఎంకే, కాంగ్రెస్‌లపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. "మన జాతీయ జెండాను అవమానించినందుకు" పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై కోరారు. అధికార డిఎంకె ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేని పక్షంలో పార్టీ నిరసనను ప్రారంభిస్తుందని హెచ్చరించారు.
ఇటీవల భారత్ చేతిలో పాక్ ఓడిపోయిన తర్వాత అభిమానులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దీనిమీద రాష్ట్ర యువజన మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. దీన్ని ప్రస్తావిస్తూ, చెన్నై స్టేడియంలో భారత జెండాను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి కుమారుడు అశోక్ సిగమణి నేతృత్వంలోని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కారణమని ఆయన ఆరోపించారు.
“చెపాక్‌లో నేటి మ్యాచ్‌కు భారత జెండాను తీసుకెళ్లడానికి స్టేడియం బయట అభిమానులను పోలీసులు అనుమతించలేదు. టీఎన్ సీఏకి ఈ హక్కు ఎవరు ఇచ్చారు?'' అని ప్రశ్నించారు.