పహల్గాం ఉగ్రవాద దాడి ఓ ఉపాధ్యాయుడిపై తీవ్ర ప్రభావం చూపింది. మతపరమైన ఈ హింస కారణంగా అతడు తన మతాన్నే మార్చుకోడానికి సిద్దమయ్యారు. 

Pahalgam Terrorist Attack : కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కలచివేసింది. మినీ న్యూజిలాండ్ గా పిలిచే పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కేవలం హిందువులే టార్గెట్ గా ఈ దాడికి పాల్పడ్డారు... ఐడీ కార్డులు చూసిమరి కాల్చిచంపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ కు చెందిన ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ ను కలచివేసినట్లుంది.... దీంతో అతడు తన మతాన్నే మారాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతడు కోర్టును ఆశ్రయించాడు. 

తాను ఏ మాతాన్ని కించపర్చడంలేదని... ప్రతి మతంపై తనకు అపారమైన గౌరవం ఉందని సబీర్ హుస్సేన్ అన్నాడు. అయితే కశ్మీర్ లో హింసాత్మక ఘటనలకు పదేపదే మతాన్ని వాడుకోవడం తనను ఎంతగానో కలచివేసిందని... అందుకే మతం మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఇకపై తాను ఏదో ఒక మతానికి చెందినవాడిలా కాకుండా మానవత్వం కలిగిన సాధారణ మనిషిలా బ్రతకాలనుకుంటున్నారని ఈ టీచర్ వెల్లడించాడు. 

మతం కారణంగా ఓ మనిషి ప్రాణాలు పోవడం దారుణం... ఇది ఎంతో బాధాకరమని సబీర్ అంటున్నాడు. మతం మారాలన్న నిర్ణయాన్ని మొదట సోషల్ మీడియా ద్వారా బైటపెట్టాడు ఈ టీచర్. కేవలం తానుమాత్రమే మతం మారతానని... కుటుంబంపై ఎలాంటి బలవంతం చేయబోనని... ఎవరికి నచ్చినవిధంగా వారు ఉంటారని అతడు అంటున్నాడు. తాను మాత్రం ఇకపై ఇస్లాంలో ప్రయాణం సాగించను... అలాగని మరో మతంలో చేరబోనని... ఏ మతవిశ్వాసాలను పాటించకుండా సామాన్య మనిషిలా జీవిస్తానని పశ్చిమ బెంగాల్ టీచర్ సబీర్ హుస్సేన్ తెలిపారు.