Pahalgam Terror Attack: కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించి భారత్‌కు తిరిగి వస్తున్నారు. 26 మందికి పైగా పర్యాటకులు మరణించిన ఈ దాడిని ఖండించిన ప్రధాని.. ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Pahalgam Terror Attack: కాశ్మీర్‌లో జరిగిన ఘోర టెర్రరిస్ట్ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తమ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించి వెంటనే భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సౌదీ అరేబియాలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విందును రద్దు చేసుకునీ, బుధవారం రాత్రే రియాద్ నుంచి భారత్‌కు బయలుదేరుతున్నట్లు సమాచారం.

ప్రధాని మోడీ తన రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకుని గురువారం రాత్రి అంటే ఏప్రిల్ 23న భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ, కాశ్మీర్‌లో టెర్రరిస్టులు పర్యాటకులపై జరిపిన దాడిని తీవ్రంగా పరిగణించి తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు. ప్రధాని బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాశ్మీర్ వెళ్లే అవకాశముంది. 

పహల్గాం టెర్రరిస్ట్ దాడి:


దక్షిణ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో పర్యాటకులపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మందికి పైగా పర్యాటకులు మరణించినట్లు సమాచారం. ఈ దాడి తర్వాత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.

టెర్రరిస్టులను వదిలిపెట్టం - ప్రధాని మోడీ

బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన వారిని శిక్షిస్తాం. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. వారి దుష్ట పన్నాగాలు ఎప్పటికీ సఫలం కావు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే మా సంకల్పం దృఢంగా ఉంది, ఇంకా బలపడుతుంది అని ప్రధాని మోడీ హెచ్చరించారు.

శ్రీనగర్‌కు వెళ్లిన హోంమంత్రి అమిత్ షా 

పహల్గాం దాడి తర్వాత హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఐబి చీఫ్, హోం సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత హోంమంత్రి నేరుగా శ్రీనగర్‌కు వెళ్లారు. ఈ ఘటన గురించి హోంమంత్రి ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం అందించారు.

రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం:

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన టెర్రరిస్ట్ దాడి నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. పహల్గాం దాడి తర్వాత ఢిల్లీలో భద్రతా బలగాలు అప్రమత్తమై పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్య ప్రదేశాలపై నిఘా పెట్టారు.