పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు పాకిస్థాన్ ను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై దూకుడుగా వ్యవహరిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందులో భాగంగానే ఉగ్రవాదుల ఇల్లను కూల్చి చేస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ దూకుడును పెంచింది. భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ అధికారులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా దాడికి పాల్పడిన మరో ఉగ్రవాది ఇంటిని కూల్చివేశారు.
అధికారుల ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని చోటిపోరా గ్రామంలో ఉన్న ఉగ్రవాది ఇంటిని ధ్వంసం చేశారు. అధికారులు కుల్గాం జిల్లాలోని ముతాల్హామా గ్రామంలో జాకీర్ అహ్మద్ గానీ అనే మరో అనుమానితుడి ఇంటిని కూడా కూల్చివేశారు. పహల్గాం ఉగ్రదాడిలో ఇతని పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉండడంతో ఆర్మీ అధికారులు ఈ చర్య తీసుకున్నారు.
గానీ 2023 నుచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడని అధికారులు తెలిపారు.
లష్కరే తొయిబా ఉగ్రవాది అయిన ఆదిల్ తోకర్ అలియాస్ ఆదిల్ గురీ ఇంటిని శుక్రవారం కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని గురీ గ్రామానికి చెందిన ఆదిల్ గురీ, పహల్గాం దాడిలో పాల్గొన్నాడని ఆధారాలు ఉన్నాయి. అతన్ని అత్యంత వాంటెడ్‌గా ప్రకటించారు. ఆదిల్ గురీని పట్టించిన వారికి రూ. 20 లక్షల రివార్డ్ ఇస్తామని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఇద్దరు పాకిస్థానీయులను కూడా ఈ కేసులో అత్యంత వాంటెడ్‌గా ప్రకటించారు.
2018లో ఆదిల్ అక్రమంగా పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ అతను ఉగ్రవాద శిక్షణ పొందాడని, గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు తిరిగి వచ్చాడని సమాచారం.
ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల ఇళ్ళు ధ్వంసం
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల ఇళ్లను ఇటీవల కూల్చివేశారు. పుల్వామాలోని ట్రాల్‌లోని లష్కరే ఉగ్రవాది ఇల్లు, అనంతనాగ్‌లోని మరో ఉగ్రవాది ఆదిల్ గురీ ఇంటిని కూల్చివేశారు.
ట్రాల్‌లో ఇల్లు కూల్చిన ఉగ్రవాది సోదరి ANIతో మాట్లాడుతూ, “నా ఒక సోదరుడు జైల్లో ఉన్నాడు, మరొక సోదరుడు 'ముజాహిదీన్', నాకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. నిన్న నేను నా అత్తవారింటి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇంట్లో కనిపించలేదు. పోలీసులు వారందరినీ తీసుకెళ్లారు.” అని చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయని పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి. జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలోని తోకర్‌పోరా నుండి వీరిద్దరినీ అరెస్టు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు భద్రతా పరిస్థితిని సమీక్షించారు.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడానికి భారత సైన్యం అప్రమత్తంగా ఉంది, అనేక సెర్చ్ ఆపరేషన్లు చేపడుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. పహల్గాం దాడిపై పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
