ఈ నెల 29, 30వ తేదీన మణిపూర్ పర్యటించనున్న ప్రతిపక్ష ఎంపీలు
మణిపూర్ హింస పై చర్చించాలని, ప్రధాని మోడీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29వ, 30వ తేదీల్లో ప్రతిపక్ష కూటమి నుంచి ఎంపీల బృందం మణిపూర్‌లో పర్యటించనున్నట్టు మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఉభయ సభలూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రభుత్వం ప్రకటన వెలువరించాలని, ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మౌనంగా పార్లమెంటులో పోరు తలపెట్టారు. అంతేకాదు, తాజాగా, మరో కీలక వార్త బయటకు వచ్చింది.
ఈ నెల చివరిలో అంటే 29వ తేదీ, 30వ తేదీల్లో సుమారు 20 మంది ఎంపీలతో ఇండియా కూటమి నుంచి ప్రతినిధుల బృందం జాతుల ఘర్షణలతో అల్లాడిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పర్యటించనున్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘటనల గురించి నేరుగా తెలుసుకోవడానికి ఈ వారాంతంలో ఇండియా కూటమి నుంచి ప్రతినిధుల బృందం మణిపూర్ వెళ్లుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు.
మణిపూర్‌లో పర్యటించాలని ప్రతిపక్ష పార్టీల చాలా కాలంగా అనుమతి కోరుతున్నాయి. కానీ, అక్కడి పరిస్థితులను పేర్కొంటూ ప్రభుత్వం వారికి అనుమతి ఇవ్వడం లేదు. అయితే.. రాహుల్ గాంధీ ఇది వరకే మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించగలిగారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్‌కు ఆయన వెళ్లి స్థానికులతో మాట్లాడిన విషయం తెలిసిందే.
Also Read: క్రైం కేసులో కీలకంగా బీర్ మూత.. ఆ క్లూతోనే నిందితులు గాలించి పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?
ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల ఎంపీలు ప్రతినిధుల బృందంలో ఉండనున్నారు.