భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్ లో జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు తెలుస్తోంది. 

Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టింది. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన స్థావరం కూడా ఉంది. భారత యుద్ద విమానాల దాడిలో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మసూద్ అజహర్ మాత్రం ఈ దాడుల నుండి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఈ దాడి తర్వాత మసూద్ అజహర్ తీవ్ర దుఃఖం వ్యక్తం చేసినట్లు... “నేను కూడా చనిపోయుంటే బాగుండేది” అని సన్నిహితుల వద్ద బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జైష్-ఎ-మొహమ్మద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ దాడిలో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, బంధువులు చాలా మంది మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపారు.

9 స్థావరాలపై దాడి

భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. వీటిలో బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఇందులోనే మసూద్ అజహర్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. భారత వాయుసేన దాడి సమయంలో మసూద్ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బైటపడ్డాడు.. కానీ ఆయన కుటుంబసభ్యులు మాత్రం చనిపోయారు. 

భారత రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో 'ఆపరేషన్ సింధూర్' ద్వారా భారత్ పై దాడులకు ప్లాన్ చేస్తున్న స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.