Operation Black Forest: ఓపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది నక్సల్స్ హ‌త‌మ‌య్యారు. నక్సలిజాన్ని 2026 మార్చి 26 నాటికి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో భద్రతాబలగాలు ముందుకు సాగుతున్నాయి.

Operation Black Forest: భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌గా చరిత్రలో నిలిచింది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌. ఈ ఆప‌రేష‌న్ విజయవంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న క‌ర్రెగుట్ట‌ల పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు 21 రోజులపాటు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), రాష్ట్ర పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

ఈ ఆపరేషన్‌లో మొత్తం 31 మంది నక్సల్స్‌ను మట్టుబెట్టారు. వీరిపై మొత్తం రూ. 1.72 కోట్ల బహుమతి ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, 214 న‌క్స‌ల్స్ స్థావ‌రాలు, బంకర్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. అలాగే, 450 IEDలు, 818 BGL షెల్లు, 899 కోడెక్స్ బండిల్లు, డిటోనేటర్లు, భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 12,000 కిలోల ఆహార సరఫరాలను కూడా గుర్తించి పట్టుకున్నారు. 

Scroll to load tweet…

ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడంలో గల్గాం ఎఫ్‌ఓబీ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్) కీలక పాత్ర పోషించింది. 2022లో కర్రెగుట్ట‌ల‌ ప్రాంతంలో ఈ బేస్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నక్సల్స్ క‌ద‌లిక‌ల‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక ఆధిక్యం లభించిందని అధికారులు తెలిపారు. ఈ స్థావరం నుంచే సమాచార పరస్పర వ్యవస్థ నడిపించారు. 

199 బెటాలియన్ సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఆనంద్ మాట్లాడుతూ.. “నక్సల్స్ కోసం భద్ర ప్రాంతాలుగా పరిగణించబడిన ప్రాంతాల నుంచి వారిని బలగాలు తరిమివేశాయి. దీంతో వారు పర్వత ప్రాంతాలకు సర్దుబాటు కావలసి వచ్చింది. ఈ ప్రాంతం మరోసారి వారి సురక్షిత స్థలంగా మారకూడదన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టాం” అని పేర్కొన్నారు.

196 బెటాలియన్ సీఆర్పీఎఫ్ కమాండెంట్ కుమార్ మనీష్ మాట్లాడుతూ.. “దక్షిణ బస్తర్ నుంచి మావోయిస్టులు, అలాగే PLGA-1, TSC (తెలంగాణ స్టేట్ కమిటీ), CRC నక్సల్స్ ఈ ప్రాంతాల్లో తలదాచుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 21 రోజుల ఆపరేషన్ అవసరమైంది” అని వెల్లడించారు.

Scroll to load tweet…

భద్రతాబలగాలు స్థానిక ప్రజలతో సంబంధాలు మెరుగుపరచడం ద్వారా మావోయిస్టుల సంబంధాలను తెంచడంలో భాగంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు అందించేందుకు శిబిరాల ద్వారా వారిని అనుసంధానం చేశామని పేర్కొన్నారు.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌తో నక్సల్స్ ఆపరేటింగ్ నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. 2026 మార్చి 26 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్యలు కొన‌సాగుతున్నాయి.