దేశవ్యాప్తంగా ఉన్న మహిళలపై హింస పెరిగిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ముగ్గురు వివాహితుల్లో ఒకరు తమ భర్త చేతిలో శారీరకంగా తీవ్ర వేధింపులకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
భర్త చేతిలో హతమవుతున్న భార్యల సంఖ్య పెరిగిపోతోంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వార్తలు అధికంగానే వచ్చాయి. కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళలపై హింస పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వారిని లైంగికంగా వేధించడం, వరకట్నం కోసం హత్య చేయడం వంటి కేసులు పెరుగుతున్నట్టు సర్వేలు వివరిస్తున్నాయి. ఎన్నో కుటుంబాల్లోని కోడళ్లు, కుమార్తెలు హింసను ఎదుర్కొని జీవించాల్సి వస్తోందని అధికారిక గణాంకాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా వరకట్న మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఏడాదిలో మరణాల సంఖ్య
హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) చెబుతున్న డేటా ప్రకారం 2022లోనే భారత దేశంలో వరకట్న వేధింపులు కారణంగా 6,516 మంది మహిళలు మరణించారు. ఇక ఆ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా అత్యాచారానికి గురై మరణించిన మహిళల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో ముగ్గురు మహిళల్లో ఒకరు భర్త చేతిలో శారీరకంగా, మానసికంగా లైంగికంగా హింసకు గురవుతున్నట్టు తెలుస్తోంది.

డేటా ఏం చెబుతోంది?
వరకట్న నిషేధ చట్టం 1961 ప్రకారం వరకట్నం ఇవ్వడం తీసుకోవడం కూడా నేరమే. కానీ ఇప్పటికీ కూడా వరకట్నం ఆధారంగానే పెళ్లిళ్లు నిర్ణయం అవుతున్నాయి. ఈ వరకట్న నిషేధ చట్టం కింద ఆ ఏడాది వేల సంఖ్యలో మహిళలు కేసులను పెట్టారు. కానీ అలా కేసులు పెట్టిన వారిలో మూడింటి ఒక వంతు మంది మరణిస్తున్నారని డేటా స్పష్టంగా తెలియజేస్తోంది. తాజాగా నిక్కీ భాటి అనే అమ్మాయిని కూడా అతని భర్త వరకట్నం కోసమే సజీవ దహనం చేశాడు. ఇలాంటి వరకట్న నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ మరణాలు ఆగకపోవడం కలవరానికి గురి చేసే విషయమే. 2019 నుంచి 2021 కాలంలో 18 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల మధ్య గల వయస్సు గల స్త్రీలలో 29 శాతం మంది తమ భర్తల వల్లే శారీరక లైంగిక హింసకు గురైనట్టు ఎన్‌సీఆర్‌బీ సర్వే చెబుతోంది.

ఈ సర్వే ప్రకారం 2022 చివరి నాటికి దాదాపు 60570 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. వీరిలో ఎంతోమంది మహిళలు కేసు పూర్తవకముందే మరణించారు. వారిలో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే, మరికొంతమంది భార్యలు... భర్తల చేతిలో హత్యకు గురయ్యారు.
మన దేశంలో వరకట్నం అనేది పెద్ద సవాలుగా మారిపోయింది. వధువు కుటుంబం తమ ఆనందం కోసం ఇచ్చే కట్నం కాస్త... వరుడు తరుపువారు డిమాండ్ చేసే స్థాయికి పెరిగింది. నిజానికి పెళ్లి కోసం వరుడు కుటుంబానికి అయ్యే ఖర్చు కన్నా వధువు కుటుంబానికి ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు ఇలా ఎన్నో వస్తువులను కట్నంగా అడుగుతారు వరుడు కుటుంబీకులు.

కోరుకున్న వస్తువులను పెళ్లి తర్వాత ఇవ్వకపోతే భార్యలను కొట్టడం, తిట్టడం సర్వసాధారణంగా మారింది. ఇదే మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన హింసగా చెబుతున్నాయి ఎన్‌సీఆర్‌బీ సర్వే. ఈ వరకట్న కేసులు త్వరగా తేల్చకపోవడం, సుదీర్ఘంగా విచారణలు సాగడం, శిక్షలు కూడా తక్కువగా పడడం, ఇక సామాజికంగా వస్తున్న ఒత్తిడి వల్ల మహిళలు నలిగిపోయి ఆత్మహత్యల బాట పడుతున్నట్టు తెలుస్తోంది.
