అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ఒక గంట ‘శ్రమదాన్’.. గాంధీకిదే స్వచ్ఛాంజలి: ప్రధాని మోడీ
అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఒక గంట పాటు దేశవ్యాప్తంగా పౌరులు సమష్టిగా స్వచ్ఛత కోసం శ్రమదానం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. మహాత్మా గాంధీకి ఆయన జయంతి రోజున ఇదే స్వచ్ఛాంజలి అవుతుందని వివరించారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన ఒక గంటపాటు శ్రమదాన్ చేయాలని పిలుపు ఇచ్చారు. స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదానం చేయాలని పిలుపు ఇచ్చినట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పిలుపు ఇచ్చినట్టు తెలిపింది.
అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ సమష్టిగా ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. మహాత్మాగాంధీకి ఆయన జయంతి రోజున ఇదే స్వచ్ఛాంజలి అవుతుందని తెలిపారు.
కాబట్టి, అక్టోబర్ 1న ఈ కార్యక్రమంలో పౌరులు పాల్గొనాలని కోరారు. శ్రమదానం కోసం మార్కెట్లు, రైల్వే ట్రాకులు, పర్యాటక కేంద్రాలు, నీటి వనరులు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, జనసముదాయాల ప్రాంతాలను ఎంచుకోవాలని వివరించారు. ప్రతి పట్టణం, గ్రామ పంచాయతీతోపాటు పౌర విమానయానం, రైల్వేలు, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థల్లోనూ స్థానికులు శ్రమదానం కోసం భాగస్వాములు కావొచ్చని తెలిపారు. శ్రమదానంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లై చేసుకోవాలని, లేదంటే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో కేంద్రం తెలిపింది.
Also Read: మన దేశంలో 80 శాతం సైబర్ నేరాలు ఈ పది జిల్లాలోనే.. వాటి వివరాలివే
అక్టోబర్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తుండటం గమనార్హం. మహబూబ్ నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.