మన దేశంలో 80 శాతం సైబర్ నేరాలు ఈ పది జిల్లాలోనే.. వాటి వివరాలివే
మన దేశంలో 80 శాతం సైబర్ నేరాలు కేవలం పది జిల్లాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఇందులోనూ అత్యధికంగా రాజస్తాన్‌లోని భరత్ పూర్, యూపీలోని మాథురలో జరుగుతున్నాయి.

న్యూఢిల్లీ: డిజిటల్ విధానం పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు చాలా వరకు ఆన్‌లైన్‌లో ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. అనేక లావాదేవీలు కేవలం ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ సేవల ఆధారంగానే కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఉన్నట్టుండి బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతున్నది. గతంలో మెస్సేజీలో లింక్‌లు పెట్టి దాన్ని క్లిక్ చేసేలా చేసి ఆన్‌లైన్‌లోనే డబ్బులు కొట్టేసేవారు. ఇప్పుడు చాలా సాధారణమైన పని ఉదాహరణకు యూట్యూబ్ చానెల్ సబ్‌స్క్రైబ్ చేయడం, లైక్‌లు కొట్టడం వంటి పనులు చేస్తే డబ్బులు ఇస్తామని ఆశజూపి ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఐటీ కాన్పూర్ స్టార్టప్ చేసిన ఓ అధ్యయనం ఆసక్తికరంగా ఉన్నది.
మన దేశంలో అత్యధిక సైబర్ నేరాలు ఎక్కువగా ఉత్తరాదిన నమోదు అవుతున్నాయి. 80 శాతం సైబర్ నేరాలు కేవలం పది జిల్లాల్లోనే రిపోర్ట్ అయినట్టు నాన్ ప్రాఫిట్ స్టార్టప్ ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది.
భరత్ పూర్(18 శాతం), మాథుర (12 శాతం), నూహ్ (11 శాతం), దియోగడ్ (10 శాతం), జంతారా (9.6 శాతం), గురుగ్రామ్ (8.1 శాతం), అళ్వార్ (5.1 శాతం), బొకారో (2.4 శాతం), కార్మా టాండ్ (2.4 శాతం), గిరిదిహ్ (2.3 శాతం) జిల్లాల్లో అధికంగా సైబర్ క్రైమ్‌లు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: పవనే సీఎం.. జనసేన కిందే టీడీపీ పని చేయాలి: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సైబర్ క్రైమ్‌లు అత్యధికంగా జార్ఖండ్‌లోని జంతారా, హర్యానాలోని నూహ్‌లో ఎక్కువగా జరిగేవి. కానీ, వీటిని రాజస్తాన్‌లోని భరత్‌పూర్, యూపీలోని మాథురలు వెనక్కి నెట్టినట్టు రిపోర్ట్ తెలిపింది. రాజస్తాన్, యూపీ, జార్ఖండ్‌లకు చెందిన జిల్లాలే ఇందులో అత్యధికంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ టాప్ పది జిల్లాల్లో ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
చట్టాన్ని పర్యవేక్షించే ఏజెన్సీల పట్టు తక్కువగా ఉండటం, డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న, పట్టణాలకు దూరంగా ఉంటున్న చోట్ల ఈ సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.