Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ విదేశీయుడు భారత్ విడిచి వెళ్లాడు..!

ఒమిక్రాన్ కేసులు మనదేశంలో రిపోర్ట్ కావడంపై ఆందోళనలు వెలువడుతున్న తరుణంలో మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు అయిన ఆ 66ఏళ్ల విదేశీయుడు ఇప్పటికే మన దేశం వదిలి వెళ్లిపోయాడు. నవంబర్ 27న ఆయన మన దేశం వదిలి దుబాయ్ చేరుకున్నాడు. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. 
 

omicron positive foreign left india on nov 27
Author
Bengaluru, First Published Dec 2, 2021, 7:00 PM IST

న్యూఢిల్లీ: మన దేశంలో రెండు Omicron కేసుల రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు Karnatakaలోనే రిపోర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరిలో ఒకరు 66 ఏళ్ల విదేశీయుడు(Foreigner) ఉన్నారు. మరొకరు Bengaluruలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పని చేస్తున్నారు. మన దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు ఉన్నాయని కేంద్రం తెలుపగానే చాలా మందిలో కలవరం మొదలైంది. అయితే, భయపడవద్దని చెబుతూనే అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పింది. అయితే, తాజాగా, మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ సోకిన ఆ 66 ఏళ్ల విదేశీయుడు దేశం విడిచి వెళ్లాడని తెలిసింది. ఔను.. ఆ విదేశీయుడు గత నెల 27వ తేదీనే మన దేశం విడిచి Dubai వెళ్లిపోయాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారి వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్టుగా ట్రావెల్ హిస్టరీ ఉన్న 66 ఏళ్ల విదేశీయుడు గత నెల 20వ తేదీన భారత్‌కు వచ్చాడు. వచ్చిన వారం రోజులకే దుబాయ్‌కి వెళ్లిపోయాడు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్) వివరాల ప్రకారం, దక్షిణాఫ్రికా నుంచి గత నెల 20వ తేదీన బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు కరోనా నెగెటివ్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేశాడు. అయితే, బెంగళూరుకు చేరగానే అక్కడ కూడా కరోనా టెస్టు కోసం ఆయన శాంపిల్స్ తీసుకున్నారు. 

Also Read: Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

ఆ విదేశీయుడు బెంగళూరులో దిగగానే అదే రోజు ఓ హోటల్‌లో బసకు దిగాడు. అదే రోజు ఇక్కడ తీసుకున్న శాంపిల్స్‌ను టెస్టు చేయగా ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ఆ విదేశీయుడికి కరోనా పాజిటివ్ రాగానే ఓ గవర్నమెంట్ డాక్టర్ ఆయనను సందర్శించాడు. ఆ 66 ఏళ్ల విదేశీయుడిలో కరోనా లక్షణాలేవీ లేవు. అయినప్పటికీ కరోనా వచ్చినందున అదే హోటల్‌లో సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించి వెళ్లారు.

ఆ వ్యక్తి కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలిసారి వెలుగు చూసిన దక్షిణాఫ్రికా వంటి హై రిస్క్ దేశం నుంచి వచ్చినందున ఆయన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గత నెల 22న పంపారు. ఆ వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన 24 మందికీ కరోనా టెస్టు చేయగా నెగెటివ్ రిజల్ట్ వచ్చాయి. అంతేకాదు, 240 మంది సెకండరీ కాంటాక్టులనూ ట్రేస్ చేసి టెస్టులు చేశారు. వారందరికీ కరోనా నెగెటివ్ అనే వచ్చింది.

Also Read: Omicron: ఒమిక్రాన్ బారిన పడ్డ ఆ ఇద్దరు ఎవరు? వారి ఆరోగ్యం ఎలా ఉంది?

అయితే, ఆ వ్యక్తి నవంబర్ 23న ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా టెస్టు చేసుకున్నాడు. అక్కడ రిజల్ట్ నెగెటివ్ అని వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 27న దాదాపు అర్ధరాత్రి ఆయన హోటల్ వదిలి పెట్టారు. ఓ క్యాబ్ తీసుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. దుబాయ్‌కి ఫ్లైట్‌లో వెళ్లిపోయాడు. అయితే, ఆయన కరోనా జాగ్రత్తలు పాటించినప్పటికీ ఐసొలేషన్‌లో లేకుండా బహిరంగంగా తిరగడం అంటే.. క్యాబ్‌లో వెళ్లడం, ఎయిర్‌పోర్టులో ఇతరులతో అనుసంధానంలోకి వెళ్లడం, ఇతరులతో కలిసి విమానంలో ప్రయాణించడం వంటి అంశాలు ఇప్పుడు కొత్త ఆందోళనలు తెచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios