Asianet News TeluguAsianet News Telugu

Omicron: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించారు?.. వారు ఎందుకు భయాందోళన చెందారు..?

దక్షిణాఫ్రికాలో (South Africa) గుర్తించిన కోవిడ్‌ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant) పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయితే ఈ వేరియంట్‌ను తొలుత ఎలా గుర్తించారు.. అసలు ఇది కొత్త వేరియంట్‌ అని ఎలా నిర్దారణకు వచ్చారు అనేది తెలుసుకుందాం..
 

Omicron Scare How South African Scientists Spotted Omicron Variant
Author
New Delhi, First Published Dec 1, 2021, 11:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దక్షిణాఫ్రికాలో గుర్తించిన కోవిడ్‌ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant) పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. విదేశీ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇంత భయాందోళనకు గురిచేస్తున్న ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో ఎలా గుర్తించారు..?, దీనిని గుర్తించిన తర్వాత పరిశోధకులు ఎమనుకున్నారో..? ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాలోని (South Africa) అతిపెద్ద ప్రైవేట్ టెస్టింగ్‌ ల్యాబ్‌లలో ఒకదానికి రాక్వెల్ వియానా ( Raquel Viana) హెడ్‌గా ఉన్నారు. అయితే నవంబర్ 19వ తేదీన ఆమె ఎనిమిది కరోనా వైరస్‌లను జన్యువును స్వీకెన్సింగ్ చేశారు. అయితే అక్కడ వచ్చిన ఫలితం చూసి షాక్ తిన్నారు.  

ఎందుకంటే ఆమె పరీక్షించిన నమునాలలో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నాయి. వైరస్ వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించే  స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్స్ ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఇది చూసిన వెంటనే పరిశోధన క్రమంలో ఏదైనా తప్పిదం జరిగిందా..? అని తన సహచరులను ప్రశ్నించినట్టుగా రాక్వెల్ వియానా తెలిపారు. అప్పుడు తనకు ఆ నమునాలు సంక్లిష్టమైన పరిణామాలకు దారితీస్తాయనే భావన వచ్చింది. 

వెంటనే రాక్వెల్ వియనా.. ఈ విషయాన్ని జోహన్నెస్‌బర్గ్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (National Institute for Communicable Diseases)లోని తన సహోద్యోగి, జీన్ సీక్వెన్సర్ డేనియల్ అమోకోకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇది తనకు కొత్త వంశంలా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాటిని ఎలా విచ్చిన్నం చేయాలో తనకు తెలియలేదని గుర్తుచేసుకున్నారు. 

ఎన్‌ఐసీడీలోని అమోకో, అతని బృందం.. నవంబర్ 20,21 తేదీల్లో వియానా పంపిన 8 నమునాలను పరీక్షించారు. వీటిన్నింటిలో ఒకే విధమైన ఉత్పరివర్తనాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. Daniel Amoako, అతని సహోద్యోగి జోసీ ఎవెరాట్, ఇతర సహచరులు కూడా దీనిని పొరపాటుగా భావించారు. అయితే వారంలో కోవిడ్ కొత్త ఉత్పరివర్తనను సూచించే కేసులలో గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే ఇందులో అల్పాతో సాధారణ రూపాంతరం ఉందని ఎవెరాట్ చెప్పారు. అయితే దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఆగస్టు నుంచి అల్ఫా వేరియంట్‌ను చూడలేదని తెలిపారు. 

Also read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే.. ఆ ఏజ్ గ్రూప్‌ మీద ఎక్కువగా ప్రభావం..!

నవంబర్‌ 23న జోహన్నెస్‌బర్గ్ (Johannesburg), ప్రిటోరియా‌ల నుంచి మరో 32 మందిని పరీక్షించిన తర్వాత కొత్త వేరియంట్‌పై స్పష్టత వచ్చిందని అమోకో చెప్పారు. ఇది చాలా భయానకంగా ఉందని అన్నారు. ఇక, అదే రోజు ఎన్‌ఐసీడీ బృందం.. దక్షిణాఫ్రికాలోని ఆరోగ్య శాఖ, ఇతర ల్యాబ్‌లకు సీక్వెన్సింగ్ గురించి తెలియజేసింది. ఆ పరీక్షల్లో ఇలాంటి ఫలితాలు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అదే రోజు ఎన్‌ఐసీడీ.. GISAID గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో ఈ వివరాలను నమోదు చేసింది. బోట్స్‌వానా, హాంకాంగ్‌లు కూడా ఇదే జన్యు సీక్వెన్స్‌తో కేసులను రిపోర్ట్‌ చేసినట్టుగా కనుగొన్నారు. ఆ తర్వాత నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇదే విషయాన్ని నివేదించారు. 

ఆ సమయంలో దక్షిణాఫ్రికా గౌటెంగ్‌లో ప్రావిన్స్‌లోని  మూడింట రెండు వంతుల సానుకూల పరీక్షలు.. S-జీన్ డ్రాప్‌అవుట్‌ను చూపిస్తున్నాయని వియానా చెప్పారు. అంటే అక్కడ ఒమిక్రాన్ డామినేట్ చేస్తుందని తెలిపారు. దక్షిణాఫ్రికా రోజువారీ COVID-19 ఇన్‌ఫెక్షన్ రేటు ఈ వారం చివరి నాటికి 10,000 కంటే నాలుగు రెట్లు పెరుగుతుందని దేశంలోని ప్రముఖ అంటు వ్యాధి నిపుణులలో ఒకరైన సలీం అబ్దూల్ కరీమ్ సోమవారం తెలిపారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా నామకరణం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation).. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనతో ట్రావెల్ బ్యాన్ విధించాయి. అయితే ఈ నిర్ణయంపై దక్షిణాఫ్రికాలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలపై అక్కడి ప్రజలు కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొత్త వేరియంట్లను కనుక్కోవడం ఆపేయాలని అమోకోను హెచ్చరిస్తూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు పరిశోధకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అమోకో మాత్రం.. ఇలాంటి విషయాలను గుర్తించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని, బాధపడకూడదని అన్నారు. 

అయితే ఇతర వేరియంట్లకు ఒమిక్రాన్ ఎలా భిన్నంగా ఉండబోతుంది, రోగ నిరోధక శక్తిని తప్పించుకుని మానవ శరీరంలోరి ఏ విధంగా ప్రవేశిస్తుంది, లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి..?, ఏ వయసు వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందనే.. విషయాలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios