92 ఏళ్ల ఓ మహిళ పాకిస్తాన్‌కు వెళ్లింది.  అక్కడ తమ పూర్వీకుల ఇల్లును చూసి బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంది. 75 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి పాకిస్తాన్‌లో అడుగు పెట్టింది. తాము చిన్నప్పుడు గడిపిన క్షణాలు, ఇల్లు, వీధి, పొరుగు వారిని గుర్తు చేసుకుంది. 

న్యూఢిల్లీ: రాజకీయంగా, భౌగోళికంగా, మరే ఇతర మార్పులు ఎన్ని చోటుచేసుకున్నా.. మనసులో పాతుకుపోయిన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటికీ అతీతంగా గాఢం అవుతూనే ఉంటాయి. కాలంతోపాటు మరింత అమూల్యంగా మారిపోతుంటాయి. అందుకే కొందరు తమ చిన్ననాటి జ్ఞాపకాలకు అంతటి విలువ ఇస్తారు. దేహానికి వయసు పెరిగినా.. జ్ఞాపకాలు మాత్రం తాజాగానే ఉంటాయి. అందుకే 92 ఏళ్ల భారతీయ మహిళ తన బాల్యం గడిచిన పూర్వీకుల ఇంటిని వెతుక్కుంటూ మళ్లీ పాకిస్తాన్ వెళ్లింది.

92 ఏళ్ల రీనా ఛిబర్ శనివారం పాకిస్తాన్ వెళ్లింది. గుడ్ విల్ గెశర్‌లో భాగంగా పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు మూడు నెలల వీసా జారీ చేసింది. వాగా అట్టారీ బార్డర్ గుండా ఆమె పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. పాకిస్తాన్ రావల్పిండిలోని వారి పూర్వీకుల ఇంటి దగ్గరకు వెళ్లింది.

అప్పుడు బహుళ వర్గాల భిన్న సాంస్కృతిక అంశాలను ఆమె గుర్తు చేసుకుంది. రావల్పిండిలోని అప్పుడు భిన్న సంస్కృతి విలసిల్లేదని పేర్కొంది. తన సోదరులకు అన్ని మతాల నుంచి మిత్రులు ఉండే వారని తెలిపింది. వారంతా తమ ఇంటికి వచ్చేవారని వివరించింది. తమ ఇంటి పని మనుషులూ భిన్న మతాలకు చెందినవారే ఉండేవారని చెప్పింది. 

1947లో దేశ విభజన జరిగినప్పుడు తమ కుటుంబం ఇండియాకు తరలి వచ్చిందని ఆమె పేర్కొంది. అప్పుడు తన వయసు 15 ఏళ్లు అని వివరించింది. కానీ, ఇప్పటి వరకు తాను తన బాల్యం గురించి, తమ పూర్వీకుల ఇంటి గురించిన జ్ఞాపకాలను తొలగించుకోలేకపోయిందని తెలిపింది. అవి శాశ్వతంగా తనలో నిలిచిపోతాయని పేర్కొంది. తమ పూర్వీకుల ఇల్లు, తమ ఇరుగు పొరుగువారు, ఈ వీధిని తాను ఎప్పటికీ తన మనసులో నుంచి తుడుచుకోలేకపోయిందని తెలిపింది.

పాకిస్తాన్‌లో తమ పూర్వీకుల ఇల్లు చూడటం కోసం 1965లోనే ఆమె వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, అప్పుడు యుద్ధ వాతావరణం ఉండటం చేత పర్మిషన్ దక్కలేదు. తాజాగా, ఆమె పాకిస్తాన్ చేరుకుని తన పూర్వీకుల ఇల్లును చూసి కన్నీరు మున్నీరు అవుతూ బాల్య జ్ఞాపకాలను 92 ఏళ్ల వయసులో నెమరేసుకుంటున్నది.