భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు(Oicron Cases) వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా16,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో కూడా పంజా విసురుతోంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు(Oicron Cases) వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 374 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నట్టుగా తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 450 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో 320 కేసులతో ఢిల్లీ నిలిచింది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 నమోదయ్యాయి. 

భారత్‌లో మరోసారి కరోనా అలజడి మొదలైంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా16,764 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,38,804 చేరింది. కరోనాతో తాజాగా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,81,080కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో.. కరోనా నుంచి 7,585 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,42,66,363కి చేరింది. ప్రస్తుతం దేశంలో 91,361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసులతో పోలిస్తే 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయిని.. ప్రస్తుతం ఇది 0.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతంగా ఉందని పేర్కొంంది. 

వ్యాక్సినేషన్..
భారత్‌లో కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. గురువారం 66,65,290 మంది వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. ఇప్పటివరకు భారత్‌లో 1,44,54,16,714 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. ఇక, రేపటి నుంచి భారత్‌లో 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. వీరికి జనవరి 3 నుంచి టీకాల పంపిణీ జరగనుంది. కోవిడ్ పోర్టల్‌‌లో నమోదు చేసుకోకపోయిన.. వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.