ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి మహిళలు, బాలికల అభ్యంతరకర వీడియోలను రూపొందించి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్ర : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఇప్పుడు ప్రతిదీ దీనిచుట్టే తిరుగుతుంది. అయితే దీనిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్న తీరు చూస్తే విస్తు పోవాల్సిందే. మహారాష్ట్రలోని పాల్ ఘర్ లో ఓ పోలీసు అధికారి కుమారులిద్దరు చేసిన పని ఇప్పుడు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. వీరిద్దరూ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పలువురు మహిళలు, యువతుల అశ్లీల వీడియోలను రూపొందించారు. ఆ తరువాత వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇది గమనించిన సదరు యువతులు దీనిని వ్యతిరేకించారు. దీంతో వారిపై యువకులు దాడి చేశారు. సదరు యువకులు దాడి చేయడంతో యువతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పాల్ ఘర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

కులులో భారీగా విరిగిపడిన కొండచరియలు.. పేక మేడల్లా కూలిన భవనాలు.. వీడియో వైరల్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులైన ఇద్దరి వయసు వరుసగా 19, 21 ఏళ్ళు ఉంటుంది. వీరి తండ్రి ముంబైలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. మహిళలు, యువతులు ఫోటోలను సేకరించిన ఈ నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్ ఉపయోగించి అశ్లీల వీడియోలు తయారు చేశారు. 

పోలీసు కమిషనరేట్‌లోని సైబర్ సెల్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సుజిత్ గుంజ్కర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని తెలిపారు. సోమవారం నాడు ఇద్దరు బాలికలు నిందితులను ఈ వీడియోలపై ప్రశ్నించడంతో వారిద్దరూ వారిపై దాడికి పాల్పడ్డారు. 

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (వేధింపులు) మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) సంబంధిత సెక్షన్ల కింద వీరిద్దరినీ మంగళవారం అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.