హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండలను ఆనుకొని నిర్మించిన భవనాలు కూడా నేలకూలాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల సమీపంలో కట్టుకున్న భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అయితే ఆ భవనాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ కొండచరియలు విరిగిపడటం, భవనాలు కూలిపోవడం, వెంటనే పెద్ద మొత్తంలో దుమ్మూ, దూళి లేవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాగా.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)తో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ దళాలు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాయి. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. నేటి నుంచి రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా.. కులు-మండి రహదారి దెబ్బతినడంతో కులు జిల్లాలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు జిల్లా నుంచి మండి వరకు ఉన్న రెండు రహదారులు ప్రభావితమయ్యాయని పోలీసులు తెలిపారు. పండోహ్ మీదుగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైంది. ప్రయాణాన్ని పునరుద్ధరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ప్రయత్నాలు చేస్తోంది.

కులు జిల్లా నుంచి మండీని కలిపే రెండు మార్గాల్లో ప్రస్తుత వర్షాలకు నష్టం వాటిల్లిందని కులు ఎస్పీ సాక్షి వర్మ ‘టైమ్స్ నౌ’కు వివరించారు. పండోహ్ గుండా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైంది. అయితే దీనిని క్లియర్ చేసేందుకు పీడబ్లూడీ చురుకుగా పని చేస్తోంది. మరోవైపు ఆహారం, తాగునీరు అందక గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.