అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఎదురైన ఇంజనీరింగ్, పరిపాలనాపరమైన సవాళ్ల గురించి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వివరించారు. దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాలతో నిర్మించిన ఈ ఆలయం, సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో రూపుదిద్దుకుందని తెలిపారు.
స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద మతపరమైన నిర్మాణం అయోధ్య రామ మందిరం. అయితే ఈ ఆలయ నిర్మాణంవెనక ఉన్న ఇంజనీరింగ్ సవాళ్ళ గురించి ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా ఏసియానెట్ న్యూసబుల్‌కు ప్రత్యేకంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ రామ మందిర నిర్మాణం కోసం పడిన సాంకేతిక, పరిపాలన, ఆధ్యాత్మిక శ్రమను పూసగుచ్చినట్లు వివరించినట్లు మిశ్రా వెల్లడించారు. ప్రపంచ స్థాయి యాత్రా అనుభూతిని అందించడానికి ఇంకా అయోధ్య మందిరంలో ఏం పనులు మిగిలి ఉన్నాయో కూడా మిశ్రా వివరించారు.
అయోధ్య మందిరం ముందున్న అతిపెద్ద సవాళ్లు
గుడి ఇప్పుడు చూడ్డానికి చాలా సులువుగా కట్టేసినట్టు అనిపించొచ్చు… కానీ నిర్మాణంలో ప్రతీ అడుగు ఓ పెద్ద సవాలేనని మిశ్రా అన్నారు. ప్రాజెక్టులో ఉపయోగించిన టైటానియం విడిభాగాల విషయంలో ఓ పెద్ద టెక్నికల్ సమస్య వచ్చిందన్నారు. వాటి తయారీలో 52 శాతానికి పైగా మెటీరియల్ వేస్ట్ అవుతోందని ఇంజనీర్లు గుర్తించారని… దీంతో కమిటీ, ప్రైవేట్ రంగ నిపుణులతో సహా ఎందరివో అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చివరకు సాంకేతికంగా సరైన, ఆర్థికంగా ఆదా చేసే పరిష్కారాన్ని కనుగొన్నామని మిశ్రా తెలిపారు.
రామ మందిరాన్ని "దశలవారీగా నెరవేరిన కల" అని అభివర్ణించిన మిశ్రా… ఈ ఘనత ఏ ఒక్క వ్యక్తికీ చెందదని, తరతరాల భక్తులు, సాధువులు, పండితులు రాముడి ఆలయం ఎలా ఉండాలో ఊహించుకున్న దాని ఫలితమే ఇదని అన్నారు. సాధువులను వర్ణించే కాంస్య కుడ్యచిత్రాలతో సహా ప్రతీ కళాత్మక నిర్ణయం, వేదాలు, పురాణాలు, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో నిపుణులను సంప్రదించిన తర్వాతే తీసుకున్నామన్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని ఆదర్శాలను ప్రతిబింబించే 79 మంది సాధువులు, ప్రముఖులను పండితుల బృందం ఎంపిక చేసిందన్నారు.
పూర్తయిన ఆలయంతో మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగినప్పుడు, మిశ్రా నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. "భక్తుల ముఖాల్లో కనిపించే సంతృప్తే నాకు ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రకారం… ఈ ప్రాజెక్టును కేవలం వాస్తుశిల్పం పరంగానే కాకుండా, యాత్రికులు ఎంత సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటున్నారనే దాని ఆధారంగా అంచనా వేయాలి.
భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు
యాత్రికుల సౌకర్యాల పరంగా చూస్తే ఆలయ వ్యవస్థ ప్రస్తుతం "సుమారు 60 శాతం మాత్రమే పూర్తయింది" అని నృపేంద్ర మిశ్రా అంచనా వేశారు. బహుభాషా సూచికలు, మరిన్ని తాగునీటి పాయింట్లు, నీడ ఉండే నడక మార్గాలు, మెరుగైన షూ కలెక్షన్ వ్యవస్థలు, సులభమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వృద్ధ భక్తులు, దేశవ్యాప్తంగా వచ్చే సందర్శకులకు అదనపు సౌకర్యాలు వంటివి ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు.
రామమందిరం కేవలం ఉత్తర భారత దేశానికే చెందిన గుడిలా ఎప్పుడూ కనిపించకూడదని ప్రణాళిక దశలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారని మిశ్రా వెల్లడించారు. ఇది అన్ని ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాల భక్తులను స్వాగతించేలా సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబించాలని ఆయన సూచించారట.
అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇంకా ఏం చేయనున్నారు?
ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో వేగంగా విస్తరిస్తున్న 71 ఎకరాల ఆలయ ప్రాంగణం గురించి కూడా మిశ్రా వివరించారు. భవిష్యత్తులో 3D రామ్ కథా మ్యూజియం, మత, సాంస్కృతిక కార్యక్రమాల కోసం పెద్ద ఆడిటోరియం, మెరుగైన ఉద్యానవనాలు, అదనపు యాత్రికుల సౌకర్యాలు, నీటి వనరులతో కూడిన కూలింగ్ సిస్టమ్స్, రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అసంఖ్యాక కరసేవకుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయనున్నట్లు మిశ్రా తెలిపారు.
అయోధ్యలో తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల్లో కూడా యాత్ర సౌకర్యవంతంగా ఉండేలా సహజ శీతలీకరణ పద్ధతులు, కవర్డ్ వాక్‌వేలు, తాగునీటి కేంద్రాలు, నీడనిచ్చే పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు. సందర్శకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మెరుగుదలలు కొనసాగుతున్నాయని, ఇది పూర్తయిన కట్టడం కాదని, నిరంతరం అభివృద్ధి చెందే ప్రక్రియ అని ఆయన అన్నారు.
నృపేంద్ర మిశ్రా ఆధ్యాత్మిక ప్రయాణం
రామ మందిర ప్రాజెక్ట్ తనను వ్యక్తిగతంగా మార్చేసిందని మిశ్రా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా సహా దశాబ్దాల ప్రజా పరిపాలన తర్వాత తాను విజయాలను వ్యక్తిగత ఘనతగా చూసేవాడినని అంగీకరించారు. అయితే ఈ ఆలయ నిర్మాణంలో ఐదేళ్ల పని తనకు వినయాన్ని నేర్పిందని చెప్పారు.
ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి చెప్పిన ఒక సందేశాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రతీ వ్యక్తి దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే ఒక 'పరికరం' మాత్రమేనని ఆమె చెప్పిన మాటలు, నాయకత్వం, సేవపై తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయని అన్నారు.
ఈ ప్రాజెక్టులో అత్యంత విశేషమైన అంశం సామూహిక భాగస్వామ్య స్ఫూర్తి అని మిశ్రా అన్నారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కళాకారులు, టెక్నాలజీ కంపెనీలు కేవలం నిపుణులుగా కాకుండా భక్తులుగా ముందుకు వచ్చారన్నారు. అనేక సంస్థలు తమ పనిని శ్రీరాముడికి సమర్పణగా భావించి, తమ ఫీజులను స్వచ్ఛందంగా వదులుకున్నాయన్నారు. ఈ ఆలయం నాలుగు లక్షలకు పైగా గ్రామాల్లోని 10 కోట్లకు పైగా కుటుంబాల నుంచి సేకరించిన విరాళాలతో నిర్మించబడిందన్నారు. విరాళాల ద్వారా సుమారు రూ. 3,200 కోట్లు సమకూరాయని మిశ్రా తెలిపారు.
మిశ్రాకు అతిపెద్ద బాధ్యత, ఆయన పదేపదే చెప్పినట్లుగా "దేవుడి డబ్బు"ను కాపాడటం. ప్రతీ ఖర్చును జవాబుదారీతనంతో, భక్తితో పరిశీలించామన్నారు… ఎందుకంటే ఈ ఆలయం లక్షలాది మంది భక్తులకు చెందిందని ఆయన అన్నారు.
నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో, రామ మందిరం కేవలం ఒక వాస్తు అద్భుతంగానే కాకుండా విశ్వాసం, సేవ, జాతీయ భాగస్వామ్యానికి సజీవ చిహ్నంగా నిలుస్తోంది. ఏసియానెట్ న్యూసబుల్‌తో ఈ ప్రత్యేక సంభాషణలో ఆలయ నిర్మాణం పూర్తికావస్తున్నప్పటికీ, ప్రతీ భక్తుడికి ఆదర్శవంతమైన యాత్రా అనుభూతిని అందించే అసలు లక్ష్యం ఇప్పుడే మొదలైందని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.


