- Home
- National
- Alcohol: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ఖాళీ సీసాలు ఇస్తే డబ్బులిస్తారు, ఒక్కో బాటిల్‌కు ఎంతంటే.?
Alcohol: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ఖాళీ సీసాలు ఇస్తే డబ్బులిస్తారు, ఒక్కో బాటిల్‌కు ఎంతంటే.?
Alcohol: మందు తాగిన తర్వాత ఖాళీ బాటిళ్లను చాలామంది చెత్తలో పడేస్తుంటారు. కానీ ఇప్పుడు అదే ఖాళీ సీసా మీకు డబ్బు తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. ఖాళీ ఆల్కహాల్ బాటిల్‌ను తిరిగి ఇస్తే వెంటనే రూ.10 రీఫండ్ అందిస్తున్నారు.

చెన్నైలో ప్రారంభమైన ప్రత్యేక ప్రయోగం
ఈ వినూత్న విధానాన్ని తొలిసారిగా తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) నిర్వహించే ప్రభుత్వ ఆల్కహాల్ దుకాణంలో దేశంలోనే తొలి రివర్స్ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులు ఖాళీ సీసాలను ఈ యంత్రంలో వేస్తే వెంటనే రూ.10 రీఫండ్ అందేలా వ్యవస్థ రూపొందించారు.
ఏఐ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ మెషీన్
ఈ రివర్స్ వెండింగ్ మెషీన్‌ను హైదరాబాద్‌కు చెందిన వ్యర్థాల నిర్వహణ సంస్థ Recykal రూపొందించింది. ఇందులో ఆధునిక కెమెరాలు, సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించారు. వినియోగదారు బాటిల్‌ను మెషీన్‌లో ఉంచగానే దానిపై ఉన్న బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తుంది. అలాగే బాటిల్ ఆకారం, బ్రాండ్, అసలుదనాన్ని కూడా పరిశీలిస్తుంది. అన్ని వివరాలు సరిపోతే వెంటనే రూ.10 రీఫండ్ విడుదల చేస్తుంది. ఒకేసారి సుమారు 3,000 ఖాళీ సీసాలను ఈ యంత్రం నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంది. నిండిన వెంటనే సంబంధిత రీసైక్లింగ్ సంస్థకు ఆటోమేటిక్‌గా సమాచారం పంపుతుంది.
ఈ నిర్ణయం వెనుక అసలు కారణం
తమిళనాడులో ప్రభుత్వ ఆల్కహాల్ దుకాణాల్లో కొన్ని చోట్ల ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించడంతో పాటు ఖాళీ బాటిళ్లను తిరిగి సేకరించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. బాటిల్ కొనుగోలు సమయంలో అదనంగా చెల్లించిన రూ.10ను తిరిగి పొందాలంటే ఖాళీ సీసాను యంత్రంలో వేయాల్సి ఉంటుంది. దీంతో అక్రమ వసూళ్లకు కూడా కొంతవరకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకూ పెద్ద అడుగు
ఈ ప్రాజెక్ట్ వెనుక మరో ముఖ్యమైన కారణం పర్యావరణ రక్షణ. నీలగిరి, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలు, అడవుల్లో పడేసిన గాజు సీసాల వల్ల వన్యప్రాణులు తీవ్రంగా గాయపడుతున్నాయని మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు సూచనల తర్వాత ప్రభుత్వం గాజు వ్యర్థాలను తగ్గించే చర్యల్లో భాగంగా ఈ రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖాళీ బాటిళ్లను తిరిగి సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ప్రకృతి, వన్యప్రాణుల రక్షణకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

