సారాంశం

New Delhi: ఇండియా పేరును 'భార‌త్' గా మార్చేందుకు ఇదే సరైన సమయమని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కాగా, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా అధికారిక పేరును భారత్ గా మార్చే తీర్మానాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
 

BJP leader Mukhtar Abbas Naqvi: దేశం పేరు మార్పు అంశం ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ధీటుగా బదులిస్తోంది. బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం మాట్లాడుతూ.. "దీనిని సరిదిద్దడానికి (దేశం పేరును 'ఇండియా' నుండి 'భారత్' కు మార్చ‌డానికి) ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను" అని అన్నారు. అలెగ్జాండర్ నుంచి తైమూర్ వరకు, గజనీ నుంచి ఘోరి వరకు, బాబర్ నుంచి బ్రిటీష్ వరకు 'భారత్' అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన జీ20 సమ్మిట్ విందుకు ఆహ్వానించిన వారిలో 'రాష్ట్రపతి ఆఫ్ ఇండియా' అని బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్' అని రాయడంతో ఎన్డీయే, ఐఎన్డీఐఏ కూటమి మధ్య చర్చ మొదలైంది. ఇరువ‌ర్గాల నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇండియా అధికారిక పేరును భారత్ గా మార్చడానికి ఒక తీర్మానాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది.

'ఇండియా' అనే పేరు వలసవాద గత అవశేషం అని పదేపదే ప్రకటించడం ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఐ.ఎన్.డి.ఐ.ఎ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్) పై బీజేపీ విమ‌ర్శ‌ల‌ దాడి చేస్తోంది. 'భారత్' పేరు చర్చలో బీజేపీ నేతలు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నగరిక్ సురక్షా సంహిత, భారతీయ సక్షా బిల్లులను హోం మంత్రి అమిత్ షా వర్షాకాల సమావేశాల్లో లోక్ సభలో ప్రవేశపెట్టిన తరువాత ఆగస్టులో ప్రభుత్వ బిల్లులపై చ‌ర్చ మొద‌లైంది. దేశం పేరు మార్పుపై కూడా అప్ప‌టినుంచి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది.