నోయిడాకు చెందిన ఓ వ్యక్తి తనకు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, ప్రధాని మోడీతోనూ సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వారితో ఫొటోలు దిగినట్టు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను చూపి టెండర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేశాడు.
నోయిడా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అంతా తనకు తెలుసు అని, తరుచూ వారితో తాను కలుస్తానని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి నమ్మబలికాడు. అందుకు సాక్ష్యాధారాలుగా వారిని కలిసినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను చూపెట్టేవాడు. తనకు అందరూ తెలుసు అని, టెండర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసిన నోయిడా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు.
నిందితుడు 36 ఏళ్ల మొహమ్మద్ కాషిఫ్ సెక్టార్ 107లో హైరైజ్ బిల్డింగ్‌లో నివసిస్తున్నాడు. యూపీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం నిందితుడు కాషిఫ్‌ను అరెస్టు చేసింది.
‘కొందరు కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రులనూ కలిసినట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోలను నిందితుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఎడిట్ చేసిన ఫొటల్లో ప్రధాని మోడీతోనూ నిందితుడు కలిసినట్టుగా చూపించేవి ఉన్నాయి.’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఎడిట్ చేసిన చిత్రాలతో తనకు టాప్ గవర్నమెంట్ ఆఫీసర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, మంత్రులతోనూ సాన్నిహిత్యం ఉన్నదని చెప్పుకునేవాడని వివరించారు. ఇలా చెబుతూ అమాయకులకు టెండర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని తెలిపారు.
Also Read: ఢిల్లీ టీనేజీ అబ్బాయిని హతమార్చిన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు, లవర్: పోలీసులు
పోలీసులు కాషిఫ్ వద్ద నుంచి మెర్సిడెస్ కార్, మూడు యాపిల్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం కోర్టులో నిందితుడిని హాజరుపరుచి జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
