Asianet News TeluguAsianet News Telugu

Omicron: గుడ్ న్యూస్.. మనదేశంలో కొత్త వేరియంట్ లేదు: కేంద్రం.. రాష్ట్రాల అధికారులతో సమావేశం

ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించిందా? అనే అనుమానాలు, భయాలు చాలా మందిలో నెలకొన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు మన దేశంలో ఒమిక్రాన్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ రోజు రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్రాల ఉన్నత అధికారులతో జరిపిన సమావేశంలోనూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పినట్టు సమాచారం.
 

no omicron cases yet in india says union health minister
Author
New Delhi, First Published Nov 30, 2021, 1:37 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్‌(New Variant)పై దేశవ్యాప్తంగా భయాందోళనలు వెలువడుతున్నాయి. ఒమిక్రాన్(Omicron) వేరియంట్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా(South Africa) నుంచి వచ్చిన వారిలోనూ ఇక్కడ కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ భయాలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో పాజిటివ్ అని తేలింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చి వయా ఢిల్లీ నుంచి ముంబయి చేరిన ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలడం, ఇంకొన్ని ఇలాంటి ఘటనలే భయాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు మన దేశంలో రిపోర్ట్ కాలేదని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కానీ, వెంటనే టెస్టులను పెంచాలని, నిఘా కూడా పెంచాలని సూచించినట్టు వివరించాయి. ముఖ్యంగా కరోనా రిస్క్ అధికంగా ఉన్న విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుడికి టెస్టులు చేయాలని రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒకవేళ పాజిటివ్ అని తేలితే, వెంటనే వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని ఆదేశించారు. తద్వారా ఆ కేసు ఒమిక్రాన్ కేసా? కాదా? తేలుతుందని తెలిపారు.

Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే.. ఆ ఏజ్ గ్రూప్‌ మీద ఎక్కువగా ప్రభావం..!

ప్రస్తుతం కరోనా టెస్టు కోసం చేపడుతున్న విధానాలు కొత్త వేరియంట్‌‌ను గుర్తించగలవని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వివరించాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ అయినప్పటికీ కరోనా వైరస్‌ను ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్సీ టెస్టు కిట్‌లు గుర్తించగలవని తెలిపాయి. ఇప్పటి వరకు అయితే, కొత్త వేరియంట్ ప్రస్తుత టెస్టింగ్ విధానాలను తప్పించుకునే పరిస్థితులు లేవని చెప్పాయి. అందుకే రాష్ట్రాలకు ఈ సూచనలు చేసినట్టు సమాచారం. కాబట్టి, వేగంగా, ఎక్కువగా టెస్టులు చేయాలని, అనుమానితుల్లో పాజిటివ్ అని తేలితే, ముఖ్యంగా కరోనా రిస్క్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ అని తేలితే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం శాంపిళ్లు పంపించాలని సూచనలు చేసినట్టు తెలిపాయి.

Also Read: Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

ఇది ఇలా ఉండగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా కూడా రాజ్యసభలో ఈ రోజు కీలక ప్రకటన చేశారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే, ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఏవైనా అనుమానిత కేసులు కనిపిస్తే వెంటనే శాంపిళ్లను జీనోమ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచనలు చేసినట్టు ఆయన వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

చాలా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా పర్యాటకుల్లోనే రిపోర్ట్ అయ్యాయి. అవి కూడా ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చినవారు.. లేదా దాని పొరుగు దేశాల నుంచి వచ్చినవారిలోనే కనిపించాయి. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి  చెందుతుండటంతో దాన్ని నిలువరించడం ఎలాగా? అనే చర్చ జరుగుతున్నది. ప్రయాణాలపై ఆంక్షలు మాత్రమే ఈ వేరియంట్‌ను నిలువరించగలవా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాతోపాటు మరో 13 దేశాల్లో కన్ఫమ్ అయినట్టు అధికారులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios