Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఖండాంతరాలు దాటి వేగంగా వ్యాపిస్తున్నది. ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికాలో ఆందోళనలు సృష్టిస్తున్న ఈ వైరస్  ఇప్పటికే ఆసియా(హాంకాంగ్), ఐరోపా(జర్మనీ, యూకే... ), ఉత్తర అమెరికా(కెనడా) సహా పలు దేశాలకు వ్యాప్తి చెందింది. దక్షిణాఫ్రికాతోపాటు మరో 13 దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏయే దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయో తెలుసుకుందాం. ఈ వేరియంట్ తొలిసారిగా బోట్స్‌వానాలో రిపోర్ట్ అయింది.
 

coronavirus new variant spread over 14 countries

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా(South Africa) దేశంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్(New Variant) ‘ఒమిక్రాన్’(Omicron) వేగంగా దేశాలు దాటుతున్నది. ఈ కేసు గురించిన వివరాలు బయటకు రాగానే చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిలువరించలేకపోయాయని తెలుస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ వేరియంట్ 14 దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాతోపాటు మరో 13 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరికొన్ని దేశాల్లో ఈ వేరియంట్‌కు ఇచ్చిన శాంపిళ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. ఈ వేరియంట్ తొలిసారిగా బోట్స్‌వానాలో రిపోర్ట్ అయింది.

చాలా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా పర్యాటకుల్లోనే రిపోర్ట్ అయ్యాయి. అవి కూడా ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చినవారు.. లేదా దాని పొరుగు దేశాల నుంచి వచ్చినవారిలోనే కనిపించాయి. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి  చెందుతుండటంతో దాన్ని నిలువరించడం ఎలాగా? అనే చర్చ జరుగుతున్నది. ప్రయాణాలపై ఆంక్షలు మాత్రమే ఈ వేరియంట్‌ను నిలువరించగలవా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాతోపాటు మరో 13 దేశాల్లో కన్ఫమ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆ దేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా:
ఈ దేశంలోనే తొలిసారిగా డెల్టా వేరియంట్ కంటే అధిక మ్యుటేషన్లు పొందిన ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయని వైరాలజిస్టు టూలియో డీ ఒలివెరా వివరించారు. ఈ కేసులను ఆ దేశ ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా ధ్రువీకరించారు.

బోట్స్‌వానా:
ఈ దేశంలో 19 ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయినట్టు ఆదివారం వెల్లడించింది. ఇవ్వాళ్టి వరకు దేశంలో 19 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఎడ్విన్ దికోలోటి వెల్లడించారు. ఇందులో చాలా కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే రిపోర్ట్ అయ్యాయని వివరించారు.

బెల్జియం: 
ఒమిక్రాన్ వేరియంట్ రిపోర్ట్ చేసిన తొలి యూరప్ దేశం బెల్జియం. ఈ కేసును బెల్జియం ఆరోగ్య మంత్రి ఫ్రాంక్ వెండెంబ్రౌక్ వెల్లడించారు. యూరప్‌లో చాలా దేశాలు ఇప్పుడు కరోనా ఫోర్త్ వేవ్‌తో సతమవుతున్నాయి.

హాంకాంగ్:
హాంకాంగ్‌లో ఇద్దరు ప్రయాణికుల్లో ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దక్షిణాఫ్రికా, కెనడాల నుంచి వచ్చిన ఇద్దరు క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఈ కేసులు నమోదయ్యాయి.

ఇజ్రాయెల్:
ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసును ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు. మాలావీ నుంచి వెనుదిగిరిన ఓ ఇజ్రాయెల్ పౌరుడిలో ఈ కేసు గుర్తించినట్టు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

యూకే:
ఈ దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులను శనివారం ధ్రువీకరించారు. వీరిద్దరూ ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ దేశం ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి విమాన రాకపోకలను నిషేధించిన సంగతి తెలిసిందే.

ది నెదర్లాండ్స్:
దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం తమ దేశానికి వచ్చిన వారిలో 13 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టులో మొత్తం 61 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే, అందులో మిగతా వారికి ఇంకా జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయాల్సి ఉన్నదని తెలిసింది.

జర్మనీ:
జర్మనీ దేశంలో ఇప్పటి వరకు మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల ద్వారా తమకు మూడు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు తెలిసిందని, ఆ ఫలితాలను ఇప్పటికే వెల్లడించామని ఆ దేశం పేర్కొంది.

చెక్ రిపబ్లిక్:
చెక్ రిపబ్లిక్‌లోని లిబెరాక్ రీజనల్ హాస్పిటల్‌లో ఒమిక్రాన్ కేసు కన్ఫామ్ అయింది. ఓ మహిళకు ఈ వేరియంట్ సోకినట్టు అధికారులు వెల్లడించారు.

డెన్మార్క్:
డెన్మార్క్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఆస్ట్రియాలోనూ ఒక కేసు ఒమిక్రాన్‌ను అనుమానిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వెనుదిగిరిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు.

ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇద్దరు ప్రయాణికుల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ దక్షిణాఫ్రికా నుంచి శనివారం సాయంత్రం సిడ్నీ వచ్చారని, వీరిద్దరూ టీకా తీసుకున్నారని, ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇటలీ:
ఇటలీలోనూ ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఆ పేషెంట్, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగానే ఉన్నదని నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

కెనడా:
కెనడాలోని ఒంటారియోలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. నైజీరియా పర్యటించి వచ్చిన ఇద్దరిలో ఈ కేసులు రిపోర్ట్ అయ్యాయని వివరించారు. దీంతో కొత్త వేరియంట్ ఉత్తర అమెరికా ఖండానికి పాకినట్టయింది.

ఫ్రాన్స్:
ఫ్రాన్స్‌లో మొత్తం ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్ దేశం కరోనా వైరస్ ఐదో వేవ్‌తో కొట్టుమిట్టాడుతున్నది. దేశంలో ఆంక్షలు కఠినం చేస్తామని ప్రకటన చేసిన తర్వాతే కొత్త వేరియంట్ కేసులు నమోదవడం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios