కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రభావం లేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్దారామయ్య అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రధాన అంశాలు అని వివరించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఇమేజీ పెరిగిందని తెలిపారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పారు.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాయి. తాజాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్దారామయ్య పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ గెలవడం ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుందని వివరించారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్నారు. సీఎం రేసులో తనకు డీకే శివకుమార్‌కు మధ్య రాజకీయంగా ఎలాంటి విభేదాలు లేవని వివరించారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలే ఉన్నాయని సిద్దారామయ్య చెప్పారు. తాము స్థానిక సమస్యలనే లేవనెత్తుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని, బీజేపీ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా సాగిందని ఆరోపించారు. అందుకే బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వివరించారు.
కర్ణాటకలో ప్రధాని మోడీ ప్రభావం ఏమీ లేదని అన్నారు. ఆయన కర్ణాటకలో పర్యటించినా దాని ప్రభావం చెప్పుకోదగినంత ఉండదని తెలిపారు. ఇవి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి ప్రజలు ఆయన పర్యటనను పెద్దగా స్వీకరించబోరని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీకి కలిసి వస్తుందని వివరించారు. రాహుల్ గాంధీకి ఆకర్షణ పెరిగిందని తెలిపారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని చెప్పారు.
Also Read: ఢిల్లీలో సహజీవన భాగస్వామి దారుణ హత్య.. 12 కి. మీ ల దూరంలో డెడ్ బాడీ
మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోటీని ప్రజలు జాతీయ స్థాయిలోనే చూస్తారని వివరించారు. వాస్తవానికి ఇవి రెండు సిద్ధాంతాల మధ్య పోరు అయినప్పటికీ ఈ పోటీని జాతీయ స్థాయిలోనే చూస్తారని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఎస్‌డీపీఐతో కాంగ్రెస్‌కు మైనార్టీ ఓట్లు దూరమవుతాయా? అని ప్రశ్నించగా కాదని సమాధానం తెలిపారు. ఓటర్లు తెలివికలవారని అన్నారు. ఎస్‌డీపీఐకి ఓటేస్తే కాంగ్రెస్ ఓట్లు చీలడం మూలంగా బీజేపీ బలపడు తుందనే విజ్ఞత మైనార్టీ ఓటర్లకు ఉన్నదని అన్నారు.
ఇవే తన చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్దారామయ్య సీఎం రేసు గురించీ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ రేసులో తాను, డీకే శివకుమార్‌లు ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇద్దరికీ ఆ ఆకాంక్ష ఉండటంలో తప్పు లేదని వివరించారు. తనకు డీకే శివకుమార్‌తో రాజకీయంగా విభేదాలేవీ లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల తీర్పుతో పార్టీ అధిష్టానం సీఎం ఎవరనే విషయాన్ని తేలుస్తుందని తెలిపారు.
