ప్రజల సంక్షేమం కోసం, అవసరాల రీత్య ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంటుంది. అలా ప్రజలకు అందే సంక్షేమ పథకాల్లో రేషన్ కూడా ఒకటి. ఈ రేషన్ ని కొందరికి ఇవ్వకూడదంటూ హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా మహిళల రక్షణలో భాగంగా.

పూర్తి వివరాల్లోకి వెళితే..మహిళల భద్రత కోసం హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా అత్యాచారం, మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని రేషన్‌ తప్పించి, మిగిలిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. దీంతో వారు వృద్ధాప్య ఫింఛన్‌, వికలాంగ ఫింఛన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆయుధ లైసెన్స్‌లకు దూరం కానున్నారు. 

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వెల్లడించారు. ఆయన గురువారం మాట్లాడుతూ..  అత్యాచారాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు తీర్పు వెలువడే వరకు తాత్కాలిక రద్దు వర్తిస్తోందని తెలిపారు. వారు ఒకవేళ దోషిగా తెలితే.. ఆ సౌకర్యాలపై జీవితకాల రద్దు వర్తిస్తోందని పేర్కొన్నారు.

అంతేకాకుండా మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్‌(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్‌ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. 

అత్యాచార, ఈవ్‌టీజింగ్‌ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా​ రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్‌టీజింగ్‌ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.