మైనార్టీ వ్యక్తులపై దాడులకు సంబంధించి తమ వద్ద డేటా లేదని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చింది. లా అండ్ ఆర్డర్, పోలీసు రాష్ట్ర జాబితా కిందకు వస్తుందని వివరించింది.
న్యూఢిల్లీ: లా అండ్ ఆర్డర్ రాష్ట్ర జాబితాలోకి వస్తుందని, ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం మెయింటెయిన్ చేయదని రాజ్యసభకు కేంద్రం తెలిపింది. మైనార్టీలపై దాడులకు సంబంధించిన సమాచారాన్ని అడిగిన రాజ్యసభ సభ్యుడు అబ్దుల్ వాహబ్‌కు ఈ సమాధానాన్ని కేంద్రం చెప్పింది.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యుడైన అబ్దుల్ వాహబ్ కేంద్ర ప్రభుత్వాన్ని మైనార్టీలకు సంబంధించి ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో మైనార్టీలపై దాడులు పెరిగాయా? ఒక వేళ పెరిగితే.. వాటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన వ్యవస్థలపై ఏమైనా దాడులు జరిగాయా? జరిగి ఉంటే వాటికి సంబంధించిన వివరాలు అందించాలని కేరళకు చెందిన ఈ ఎంపీ అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
పబ్లిక్ ఆర్డర్, పోలీసు వ్యవస్థ రాష్ట్ర జాబితా కిందకు వస్తుందని సమాధానం వచ్చింది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం వీరు ఈ జాబితా కిందకు వస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం, మైనార్టీలు సహా పౌరులు అందరిపై జరిగే నేరాలపై విచారణ, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఆయా రాష్ట్రాలకే ఉంటుందని వివరించారు. కాబట్టి, ప్రత్యేకంగా ఒక ఇండివిడ్యువల్ కమ్యూనిటీ పర్సన్‌పై దాడులను కేంద్ర ప్రభుత్వం మెయింటెయిన్ చేయదని పేర్కొన్నారు. అయితే, దేశంలోని అంతర్గత భద్ర, లా అండ్ ఆర్డర్ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని వివరించారు. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్‌ను పంపుతుంటామని పేర్కొన్నారు.
