నితీశ్ కుమార్ మా మనిషే.. ఎప్పుడైనా తిరిగి ఎన్డీయేకు రావొచ్చు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమ మనిషేనని, ఏ సమయంలోనైనా తిరిగి ఎన్డీయేలోకి చేరవచ్చునని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ఎన్డీయేలోకి తిరిగివచ్చే వ్యక్తి మళ్లీ విపక్షాల కూటమిలో ఎందుకు చేరారో అర్థం కావడం లేదని వివరించారు.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుని ప్రతిపక్షాలు ఆర్జేడీ, వామపక్షాలతో చేతులు కలిపి బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ మా మనిషేనని, ఏ సమయంలోనైనా తిరిగి ఎన్డీయేకు రావొచ్చని వివరించారు. ఆయన ఎన్డీయేతో చాలా సాన్నిహిత్యంగా మెలిగారని, ఇప్పటికీ ఆయన లేని లోటు ఎన్డీయేలో కనిపిస్తుందని అన్నారు. అంతేకాదు, ఎన్డీయేలోకి తిరిగి వచ్చే నితీశ్ కుమార్ మళ్లీ ఎందుకు విపక్షాల కూటమిలో చేరాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు, ముుంబయిలో జరగనున్న విపక్షాల మూడో దశ సమావేశానికి నితీశ్ కుమార్ హాజరు కావొద్దనీ సూచించారు.
నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. విపక్ష పార్టీలను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో సఫలం అవుతున్నారు. విపక్షాల తొలి సమావేశం ఆయన రాష్ట్రం బిహార్‌లో నిర్వహించారు. ఆ తర్వాత రెండో భేటీ బెంగళూరులో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరు భేటీకి ముందు విపక్షాలతో నితీశ్ కుమార్‌కు చెడిందనే వార్త గుప్పుమంది. వాటిని నితీశ్ కుమార్ కొట్టివేశారు. తన సూచనలను విపక్షాల కూటమి పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.
Also Read: హనీమూన్‌కు వెళ్లుతుండగా నవ వధువు మిస్సింగ్.. అర్ధంతరంగా నవ వరుడు రివర్స్.. ఏం జరిగిందంటే?
ఈ సందర్భంలో కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీప్ రాందాస్ అథవాలే నితీశ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పటికైనా తమ మనిషేనని, ఏ సమయంలోనైనా ఆయన ఎన్డీయేలోకి రావొచ్చని చెప్పారు. ఇదే సందర్భంలో బిహార్‌లో అభివృద్ధి జరుగుతున్నదని నితీశ్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు బిహార్‌లో వేగంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు.