ఐరాస ప్యానెల్ డిస్కషన్‌లోకి నిత్యానంద కల్పిత దేశం కైలాస ప్రతినిధులు వచ్చారు. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొని వారి కల్పిత దేశంలోని విధానాల గురించి మాట్లాడారు. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశాన్ని యూఎన్ గుర్తించిందా? ఆ ఫొటోలు నిజమైనవేనా? వంటి అనేక ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు సమాధానాలు ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ: రేప్ కేసు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న.. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నిత్యానంద 2019లో భారత్ దేశాన్ని వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెంట్రల్ అమెరికాలో పసిఫిక్ తీరాన ఉన్న ఓ చిన్న దీవిలో సొంత దేశాన్నే నిత్యానంద స్థాపించినట్టు వార్తలు వచ్చాయి. దానికి కైలాస అనే పేరు పెట్టాడని, అందులో 2 బిలియన్ల హిందువులు ఉన్నట్టు కొన్ని కథనాలు ఆ మధ్య ప్రచురితం అయ్యాయి. ఇదొక కల్పిత దేశమే. దీన్ని ఏ దేశమూ.. మరే అంతర్జాతీయ సంస్థ గుర్తించలేదు. కానీ, తాజాగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే బోర్డు ముందు పెట్టుకుని ఆ దేశ ప్రతినిధులుగా పోజు కొడుతూ కొందరు ఐరాస ప్యానెల్ డిస్కషన్‌లో దర్శనం ఇచ్చారు. ఆ ఫొటోల్లో నిత్యానంద కటౌట్ కూడా వెనుకాలే కనిపించడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. నిజంగానే ఐరాసలోకి నిత్యానంద కల్పిత దేశం కైలాస నుంచి ప్రతినిధులు వెళ్లారా? ఆ ఫొటోలు నిజమైనవేనా? ఒక వేళ నిజమైతే కైలాస దేశాన్ని ఐరాస గుర్తించిందా? వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి 24వ తేదీన స్థిర అభివృద్ధిపై ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కమిటీ ఓ జనరల్ డిస్కషన్ పెట్టింది. ఈ డిస్కషన్‌లో ఇద్దరు వ్యక్తులు తమను తాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు అని పేర్కొన్నవారు పాల్గొన్నారు.
ఐరాస 193 దేశాలను గుర్తించింది. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస లేదు. నిజానికి ఐరాసలో సభ్యత్వం పొందడం అంత సులువేమీ కాదు. సభ్యత్వానికి ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ఇది అంత తేలికేమీ కాదు. మరి యునైటెడ్ స్టేట్స్ ఆప్ కైలాస ప్రతినిధులుగా పోజు కొడుతున్న ఫొటోలు డమ్మీవేనా?
కాదు, ఆ ఫొటోలు వాస్తవమైనవే. నిజంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస నుంచి ఇద్దరు ప్రతినిధులు ఆ డిస్కషన్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. జెనీవాలోని ఐరాస హ్యూమన్ రైట్స్ ఔట్‌ఫిట్ దాని సమావేశాల్లో ఓపెన్ సెషన్‌లలో.. సంస్థ సభ్యులుగా లేని వారినీ, దారిన పోయే దానయ్యను కూడా వచ్చి మాట్లాడటానికి అనుమతి ఇస్తుంది. అంటే.. బయటి వారు మాట్లాడటంపై ఈ ఔట్‌ఫిట్ అభ్యంతరాలు చెప్పదు. అందుకే ఇది నిర్వహించే సమావేశాల్లో తరచూ నకిలీ సంస్థలు, ఊరు పేరు లేని సంస్థలూ వచ్చి పోజులు కొడుతూ ఉంటాయి. అంతేనా.. నిజమైన సభ్య దేశాలకు ప్రశ్నలూ వేస్తాయి. హద్దుమీరినట్టుగా ప్రవర్తిస్తాయి కూడా. కానీ, వాటికి వాస్తవ సభ్య దేశాలు అరుదుగానే స్పందిస్తాయి. వాటికి స్పందించడం ద్వారా ఆ నకిలీ సంస్థలను గుర్తించినట్టవుతుంది. కాబట్టి, పెద్దగా రియాక్ట్ కావు. కాబట్టి, ఆ ఇద్దరు ప్రతినిధులు యూఎన్ ప్యానెల్‌లో మాట్లాడి సాధారణ ప్రజల దృష్టిలో వారి కల్పిత దేశాన్ని యూఎన్ గుర్తించిందనే భ్రమ కల్పించడానికే ఈ స్టంట్ అని అర్థమైపోతున్నది.
Also Read: ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద
ఫిబ్రవరి 24వ తేదీ నాటి కమిటీకి మొహమ్మద్ అబ్దెల్ అధ్యక్షత వహించారు. ఈ చర్చలో ఒక మహిళ ‘కైలాస’ దేశంలో హిందూయిజం అధిపతి నిత్యానంద సారథ్యంలో పురాతన హిందూ విధానాలను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థిరాభివృద్ధి కోసం ఈ దేశంలో ఆహారం, ఆవాసం, దుస్తులు, విద్య, వైద్యం పౌరులందరికీ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఆమె పేరు విజయప్రియ నిత్యానందగా చెప్పుకుంది. మరో మహిళ లేచి ఏదో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒక రైతుగా చెప్పుకున వ్యక్తి పాకిస్తాన్ దేశ ప్రతినిధిగా ఒక ప్రశ్న వేశారు. కానీ, దానికి సమాధానం ఆ దేశం ఇవ్వలేదు.
ఈ సమావేశానికి వచ్చిన వారు నిత్యానంద పుస్తకంతో ఫొటోలు దిగారు. అక్కడికి నిత్యానంద కటౌట్‌నూ తీసుకెళ్లారు. ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
