సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద: పేరు ఇదే..!!
భారతదేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఏకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన దానికి ‘‘కైలాస’’ అని పేరు పెట్టాడు
అత్యాచారం, కిడ్నాప్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత బోధకుడు నిత్యానంద ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి తనఖీలు నిర్వహించారు.
ఇప్పటికే భారతదేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఏకంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన దానికి ‘‘కైలాస’’ అని పేరు పెట్టాడు
Also Read:మరో వివాదంలో స్వామి నిత్యానంద: తమ కూతుళ్లను నిర్బంధించారని దంపతుల ఆరోపణ
ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గరల్లోని ఈ ద్వీపానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని కూడా నిత్యానంద డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి సంబంధించి ప్రతిరోజు కేబినెట్ భేటీలు సైతం జరుపుతున్నారని సమాచారం. కైలాస దేశానికి ప్రధానిగా ‘‘మా‘‘ని నియమిచంగా... గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ని రూపొందించారని నిత్యానందకు సంబంధించిన ‘‘కైలాస’’ దేశ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.
ఇక్కడితో ఆగిపోకుండా తన కైలాసకు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందుత్వని ప్రచారం చేయడం వల్లే భారతదేశంలో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితికి పంపనున్న వినతిపత్రంలో నిత్యానంద పేర్కొన్నారు.
కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందుత్వ పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ దేశ వెబ్‌సైట్‌లో తెలిపారు. తమ దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో తెలిపారు.
మెరూన్‌కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చొని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. అలాగే ప్రభుత్వంలో పది శాఖలను సైతం ఏర్పాటు చేశారు.
అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయంల కాగా.. విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య మొదలైనవి ఇతర శాఖలు. అలాగే తమది సరిహద్దులు లేని దేశమని, తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయ్యిందని కైలాస వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
కైలాసలో ఉచితంగా భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని.. ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని వెబ్‌సైట్‌లో తెలిపారు. ఏ దేశ ఆధిపత్యం కిందా లేని తాము ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటామని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
తమది భౌగోళికపరమైన దేశం కాదని.. ఒక భావనాత్మక దేశమని, శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశమన్నారు. నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్.. తమిళనాడుకు చెందిన ఈయన 2000లో బెంగళూరుకు సమీపంలో ఓ ఆశ్రమాన్ని స్థాపించి తన ప్రవచనాలతో ప్రజలను ఆకర్షించాడు.
అయితే 2010లో ఓ సినీనటితో నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి బయటకు రావడంతో ఆయన అసలు లీలలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అతనిపై రేప్ కేసు నమోదై జైలుకు సైతం వెళ్లారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి.. గడువు ముగిసినా పోలీసులకు లొంగిపోలేదు.
Also read:నా భార్య.. నిత్యానంద చెరలో ఉంది.. రక్షించండి
నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్థన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల పరిరక్షణ కమీషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశ్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నకిలీ పాస్‌పోర్ట్‌తో నేపాల్ మీదుగా ఇటీవల భారత్‌ను విడిచి పారిపోయారు.