న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ తనను తాను గాయపరుచుకోవడానికి ప్రయత్నించాడు. స్టేపుల్ పిన్స్ మింగడానికి అతను గురువారం తీహార్ జైలులో ప్రయత్నించాడు.

జైలు అధికారులు అతన్ని ఆపేసి జైలు ఆస్పత్రి వైద్యశాలలో చికిత్స అందించారు. దోషులను చివరిసారి చూడడానికి రావాల్సిందిగా జైలు అధికారులు వినయ్, అక్షయ్ కుటుంబ సభ్యులకు నోటీసులు పంపించారు. 

Also Read: ట్రీట్‌మెంట్ కోసం వినయ్ శర్మ పిటిషన్: షాకిచ్చిన కోర్టు

మరో ఇద్దరు దోషులు ముకేష్, పవన్ కుటుంబ సభ్యులు ఇదివరకే వారితో భేటీ అయ్యారు. జనవరి 31వ తేదీన ఆ భేటీ జరిగింది. కుటుంబ సభ్యుల చివరి భేటీకి తేదీ ఇవ్వాలని అధికారులు అక్షయ్, వినయ్ లను కూడా అడిగారు. వారంలో రెండు సార్లు ఉండే ములాకత్ జరుగుతూనే ఉంది. 

డెత్ వారంట్ జారీ అయినప్పటి నుంచి వినయ్ శర్మ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని, హింసాప్రవృత్తి పెరిగిందని జైలు అధికారులు చెబుతున్నారు. అతని మానసిక, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. 

దోషులపై 24 గంటల నిఘా పెట్టారు. అధికారులు కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడా ఆహారం తీసుకుంటున్నారని, అయితే, మోతాదు తగ్గించారని జైలు అధికారులు చెప్పారు. 

Also Read: నిర్భయ కేసు: కుటుంబ సభ్యులతో చివరి భేటీపై దోషులకు లేఖ

2012 డిసెంబర్ 16వ తేదీన ఆరుగురు వ్యక్తులు వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు నిందితుల్లో ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.