న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులతో చివరి భేటీపై తీహార్ జైలు అధికారులు నిర్భయ కేసు దోషులకు లేఖ రాశారు. ఉరి తీయడానికి ముందు కుటుంబ సభ్యులతో చివరిసారిగా భేటీ కావడంపై వారు ఆ లేఖ రాశారు. 

మీ కుటుంబ సభ్యులను ఎప్పుడు కలవాలని కోరుకుంటున్నారని దోషులు అక్షయ్, వినయ్ శర్మలను అడిగినట్లు జైలు అధికారులు చెప్పారు. మరో ఇద్దరు దోషులు ముకేష్, పవన్ ఫిబ్రవరి 1వ తేదీ డెత్ వారంట్ కు ముందే కుటుంబ సభ్యులను కలిశారు. 

See Video: వినయ్ సింగ్ కాదు, న్యాయవాది ఎపి సింగ్ కి మతిచెడింది...: నిర్భయ తల్లి

మార్చి 3వ తేదీకి రెండు రోజుల ముందు తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికార యంత్రాంగాన్ని కోరారు. మార్చి 3వ తేదీన నలుగురు దోషులను కూడా ఉరి తీయనున్నారు. తలను గోడకేసి బాదుకున్న తర్వాత వినయ్ శర్మపై ఎక్కువ పర్యవేక్షణ పెట్టినట్లు తెలిపారు. అతని ప్రవర్తన చాలా మారిందని చెప్పారు. 

నిర్భయ కేసులోని నలుగురు దోషులను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని పాటియాల హౌస్ కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన తాజా డెత్ వారంట్లు జారీ చేసింది. ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ (26), అక్షయ్ కుమార్ (31)లను మార్చి 3వ తేదీన ఉరి తీస్తారు. వారిపై డెత్ వారంట్ జారీ చేయడం ఇది మూడోసారి. 

Also Read: నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన దోషి

2012 డిసెంబర్ 16వ తేదీ ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురిలో ఒకతను జైలులో ఆత్మహత్య చేసుకోగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.