ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యానంతరం నిందితుడు మృతదేహాన్ని కారు పక్కసీటులోనే పెట్టుకుని 40.కి.మీ.ల వరకు ప్రయాణించాడు.

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిక్కీ యాదవ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సహజీవనం చేస్తున్న యువతిని హతమార్చి ఫ్రీజర్ లో దాచిన ఘటన దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో యువతని చంపిన తర్వాత పక్క సీట్లో కూర్చోబెట్టుకొని 40 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు సాహిల్ గహ్లోత్.. నిక్కీ యాదవ్ అనే యువతిని కారులోనే చార్జింగ్ వైరుతో మెడకి చుట్టి చంపేసి.. శవాన్ని తన పక్క సీటులోనే పెట్టుకొని 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. ప్రయాణం చేసిన తర్వాత దక్షిణ ఢిల్లీలోని తన దాబాకు చేరుకున్నాడు.

డాబా లోని ఫ్రీజర్ లో ఆ యువతి మృతదేహాన్ని దాచిపెట్టాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సాహిల్ అరెస్టు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరాడక చనిపోయినట్లుగా తేలింది. ఢిల్లీ కోర్టు అతనిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజ్తో విషయం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం పూట నిక్కీ యాదవ్ కదలికలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఆరోజు మధ్యాహ్నం అపార్ట్మెంట్ పై అంతస్తులోకి నిక్కీ యాదవ్ వెళ్ళింది. రాత్రి 9 గంటలకి ప్లాట్ లో నుంచి బయటికి వచ్చింది. ఇదంతా సీసీటీవీలో నమోదయింది.

శ్రద్ధా వాకర్ హత్య తరహాలో నిక్కీ యాదవ్ హత్య .. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్

నిక్కీ యాదవ్ ఇక్కడ తన బంధువులతో కలిసి ఉంటుంది. ఆమె ఐదు నెలలుగా ఇక్కడ ఉంటుందని, తన బంధువుతో కలిసి ఉంటుందని ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదని.. అయితే సాహిల్ మాత్రం తరచుగా ఆమె ప్లాట్కు వచ్చి పోతుండేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. కోచింగ్ సెంటర్ కు వెళ్లేప్పుడు సాహిల్, నిక్కీ యాదవ్ ఒకే బస్సులో వెళ్లేవారు. అలా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రేమించిన నిక్కీని కాదని సాహిల్ ఫిబ్రవరి 6న మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం ఎలాగో నిక్కీకి తెలిసింది. దీంతో సాహిల్ ను నిలదీసింది. 

ఆ రోజు రాత్రి సాహిల్ నిక్కీ ప్లాట్ కు వచ్చాడు. ఆ తర్వాత ఆమెను తీసుకొని ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు తిరిగారు. ఆ సమయంలో నిక్కి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరిగింది. నిక్కి యాదవ్ తనను వదిలేలా లేదని అనుకున్న సాహిల్ ఆమెను అటు తొలగించుకోవాలనుకున్నాడు. వెంటనే కారులో ఉన్న మొబైల్ ఛార్జింగ్ వైర్ తో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సాహిల్ నిక్కీ మృతదేహాన్ని తన డాబాలోని ఫ్రీజర్ లో దాచి పెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అతి మామూలుగా నజఫగర్ లోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 10న నిశ్చితార్థం జరిగిన యువతీతో పెళ్లి చేసుకున్నాడు.

అయితే నాలుగు రోజులుగా నిక్కీ ఫోన్లో దొరకకపోవడం.. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిక్కీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న ఓ దాబాలోని ఫ్రీజర్ లో నిక్కీ మృతదేహం దొరికింది. ఆ తర్వాత నిక్కి యాదవ్, సాహిల్ కలిసి తిరిగే వారిని, ప్రేమికులని తేలింది. దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని పోలీసుల స్టైల్ లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.