దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేగింది. నైజీరియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో అతని శాంపిల్స్‌ను పూణేలోని ల్యాబ్‌కు పంపారు. అక్కడి టెస్టుల్లో అతనికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. 

దేశంలో మంకీపాక్స్ వైరస్ (monkeypox virus) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో ఒకరు మంకీపాక్స్‌తో ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా ఢిల్లీలో ఓ 35 ఏళ్ల నైజీరియన్ వ్యక్తికి (Nigerian) మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. మరోవైపు నైజీరియన్ జాతీయుడు ఢిల్లీలో నివసిస్తున్నాడు. అతనికి ఎలాంటి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేదు. అయినప్పటికీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఢిల్లీలో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిన రెండో వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. 

Also REad:మరణించిన ఆ వ్యక్తికి యూఏఈలోనే మంకీపాక్స్ పాజిటివ్: కేరళ హెల్త్ మినిస్టర్

నైజీరియన్ జాతీయుడిని చికిత్స నిమిత్తం ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌కు తరలించారు. గడిచిన ఐదు రోజులుగా శరీరంపై బొబ్బలు, జ్వరంతో అతను బాధపడుతున్నాడు. దీంతో అధికారులు నైజీరియన్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షఅలో ఇతనికి పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే.. ఆఫ్రికన్ మూలాలున్న మరో ఇద్దరు వ్యక్తులు మంకీపాక్స్ అనుమానితులు కూడా ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

కాగా.. సోమవారం తెల్లవారుజామున మంకీపాక్స్ లక్షణాలున్న యువకుడిని జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని నమూనాలను పూణే ల్యాబ్‌కు పంపినట్లు రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సూపిరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. అతను ఆదివారం అర్ధరాత్రి కిషన్ గడ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడటంతో పాటు శరీరంపై దద్దుర్లు వున్నాయని అధికారులు తెలిపారు. దీంతో సదరు యువకుడిని మంకీపాక్స్ స్పెషల్ వార్డులో వుంచి పర్యవేక్షిస్తున్నారు.