ఐసిస్ లింకులు.. తమిళనాడులో 25 చోట్ల, హైదరాబాద్‌లో 4 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు..
తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం ఉదయం సోదాలు చేపట్టింది.

తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఐసిస్ కోణంలో దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ సోదాలు నిర్వహిస్తుంది. తమిళనాడులో 25 చోట్ల, తెలంగాణలోని హైదరాబాద్‌లో నాలుగుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు శనివారం ఉదయం సోదాలు ప్రారంభించారు. కోయంబత్తూరులో 22 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఐసిస్ మాడ్యూల్‌కు సంబంధించిన కేసులో సోదాలు జరుగుతున్నాయి.
కోయంబత్తూరు నగరంలోని కరుంబుక్కడై, జిఎం నగర్, కినాతుకడవు, కవుందంపళయం, ఉక్కడం, మరికొన్ని ప్రాంతాల్లోని 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు ప్రారంభించారు. చెన్నైలోని నీలంకరై, అయనవరం, తిరు వికా నగర్‌లో కూడా సోదాలు జరుగుతున్నాయి. కోయంబత్తూరు నగరంలోని పెరుమాళ్ కోవిల్ స్ట్రీట్‌లోని కోయంబత్తూరు కార్పొరేషన్ 82వ వార్డు కౌన్సిలర్, డీఎంకే నేత ఎం ముబసీరా నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.
2022 అక్టోబర్ 23న కోయంబత్తూరులోని ఉక్కడం వద్ద ఉన్న ఈశ్వరన్ కోవిల్ స్ట్రీట్‌లోని కొట్టై సంగమేశ్వరర్ ఆలయం ముందు జరిగిన కారు పేలుడులో ఐసిస్ అనుచరుడు జమేషా ముబీన్ మరణించాడు. అతడు కోయంబత్తూరులోని కోవై అరబిక్ కాలేజీలో చదువుతున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఎన్‌ఐఏ అధికారులు కోయంబత్తూర్‌లోని అరబిక్ కళాశాలలో గత నెలలో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తమిళనాడు ఐసిస్ మాడ్యూల్, రిక్రూట్‌మెంట్, రాడికలైజేషన్‌కు సంబంధించి ఎన్‌ఐఏ కొన్ని పత్రాలను సేకరించి కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే తాజా సోదాలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.