వచ్చే రామనవమి.. అయోధ్య రామ మందిరంలోనే: ప్రధాని మోడీ
వచ్చే రామనవమి అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని చూడటం మన అదృష్టమని వివరించారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో ఏళ్ల తరబడి అందరూ ఎదురుచూశారని, ఇప్పుడు ఆ కల సాకారం అవుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామ మందిర నిర్మాణం చూస్తున్న మనం ధన్యులమని తెలిపారు. ఇది మన సహనం సాధించిన విజయం అని చెప్పారు. రామ మందిరం మరికొన్ని నెలల్లో ప్రారంభం అవుతుందని అన్నారు. వచ్చే రామ నవమి అయోధ్యలోని రామ మందిరంలోనే జరుగుతుందని తెలిపారు. విజయ దశమి సందర్భంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ హాజరై మాట్లాడారు.
విజయ దశమి గురించి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని ప్రధాని అన్నారు. దసరా రోజున ఆయుధ పూజ చేసే ఆనవాయితీ ఉంటుందని వివరించారు. ఈ ఆయుధాలు ఎదుటి వారిపై దాడి చేయడానికి, ఆక్రమణ చేయడానికి కాదని తెలిపారు. స్వీయ రక్షణ కోసమే ఈ ఆయుధాలు అని వివరించారు. చంద్రుడిపైకి మన చంద్రయాన్ మిషన్ విజయవంతంగా ప్రయోగించి ఈ దసరాతో రెండు నెలలు గడుస్తున్నాయని తెలిపారు.
Also Read: మాకు ఆ వివరాలు తెలియజేయండి.. ఇజ్రాయెల్ సైన్యం ఫ్లైట్‌లో నుంచి పాలస్తీనాలో కరపత్రాలు
రామ్ లీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేష దారణలో కళాకారులు ప్రదర్శనకు వచ్చారు. వారికి ప్రధాని మోడీ స్వయంగా తిలకం దిద్ది హారతి పట్టారు. రామ్ లీలా మైదానంలో రావణ దహనం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలోనూ ప్రధాని మోడీ పాల్గొన్నారు.