మాకు ఆ వివరాలు తెలియజేయండి.. ఇజ్రాయెల్ సైన్యం ఫ్లైట్‌లో నుంచి పాలస్తీనాలో కరపత్రాలు
హమాస్ సాయుధ గ్రూపు ఇజ్రాయెల్ బంధీలను విడిచి పెడుతూ ప్రపంచ దేశాల నుంచి సానుభూతి పొందే అవకాశాలను సుగమం చేసుకుంది. అయితే, ఇజ్రాయెల్ ఆ బంధీల వివరాలను పొందడానికి పాలస్తీనాలో కరపత్రాలను సైనిక విమానాల నుంచి విడిచిపెడుతున్నారు. ఆ వివరాలు అందించిన వారికి రివార్డు ప్రకటించడంతోపాటు వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
న్యూఢిల్లీ: హమాస్ సాయుధ గ్రూపు బంధీలుగా మార్చుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా విడిచిపెడుతున్నది. బంధీలు కూడా తమను హమాస్ సాయుధులు బాగానే చూసుకున్నారని చెబుతున్నారు. ఈ రకంగా ప్రపంచ దేశాల నుంచి సానుభూతి పొందే అవకాశాలను హమాస్ సాయుధ గ్రూపు కలిగించుకుంటున్నది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నది. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ సాయుధ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని, అలా అందించిన వారికి రివార్డు అందిస్తామని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్ పేర్కొంది.
‘మీరు శాంతియుతంగా జీవించాలని అనుకుంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటే ఒక మానవ సహాయం చేయండి. మీ ఏరియాల్లో బంధీల వివరాలను మాకు అందించండి’ అని మిలిటరీ ఆ కరపత్రంలో పేర్కొంది. ‘ఈ సమాచారం అందించిన వారికి, వారి ఇంటికి భద్రత అందించడమే కాదు, ఆర్థిక సహకారం కూడా అందిస్తాం. మీ వివరాలను గోప్యంగా ఉంచడం మా బాధ్యత’ అని తెలిపింది.
ఈ బంధీల గురించి సమాచారం అందించడానికి అవసరమైన ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాలను ఆ కరపత్రాల్లో పొందుపరిచింది.
Also Read: హమాస్ మంచిగానే చూసుకుంది, సాలెగూళ్ల లాంటి సొరంగాళ్లలోకి తీసుకెళ్లారు: విడుదలైన ఇజ్రాయెల్ మహిళ
దక్షిణాది గాజాలోని నాస్సర్ హాస్పిటల్‌లో ఆశ్రయం పొందుతున్న శరణార్థి ఖాన్ యూనిస్ ఈ కరపత్రాన్ని చించేశాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ఓ పాలస్తీనా వాసి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మీరేం కావాలని కోరుకున్నా.. మాకు అవసరమే లేదు. గాజాలోని మేమంతా ఏం చెబుతున్నామంటే.. తూర్పు నుంచి పశ్చిమం వరకు మేం ప్రతిఘటిస్తున్నాం’ అని వివరించారు.