నదీ తీరంలో నవజంట ఫోటో షూట్... కాలుజారి నీటిలోపడి ముగ్గురు దుర్మరణం
పెళ్ళయి వారంరోజులు కూడా గడవకముందే నవ దంపతులు మృతిచెందిన విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది.

తిరువనంతపురం : నవ జంట సరదాగా ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించి మరొకరు కూడా నదిలో మునిగిపోయాడు. ఇలా కొండపై నుండి నదిలోకి పడిపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళ కొల్లాం జిల్లాకు చెందిన సిద్దిఖి, నౌఫి దంపతులకు వారం రోజుల క్రితమే పెళ్లయ్యింది. ఓ పంక్షన్ లో పాల్గొనేందుకు సమీప బంధువు అన్సిల్ ఇంటికి వెళ్లారు నవ జంట. ఈ క్రమంలోనే నవ దంపతులు సరదాగా ఫోటోలో దిగేందుకు సమీపంలోని ఓ నది వద్దకు వెళ్లారు. దంపతులిద్దరిని అన్సిల్ ఫోటోలు తీస్తుండగా ఒక్కసారిగా వారు కాలుజారి నదిలో పడిపోయారు. సిద్దికి, నౌఫి దంపతులను కాపాడేందుకు అన్సిల్ కూడా నదిలోకి దూకాడు. దీంతో ముగ్గురూ నీటమునిగి గల్లంతయ్యారు.
విషయం తెలిసి నదివద్దకు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోజంతా గాలింపు చేపట్టగా ఆదివారం సాయంత్రం మృతదేహాలు లభించాయి. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొల్లాం మెడికల్ కాలేజీకి తరలించారు. నవ దంపతులతో పాటు సమీప బంధువు మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.